Page Loader
StarLink: భారత మార్కెట్‌లోకి స్టార్‌లింక్‌ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. షరతులకు అంగీకారం 
భారత మార్కెట్‌లోకి స్టార్‌లింక్‌ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. షరతులకు అంగీకారం

StarLink: భారత మార్కెట్‌లోకి స్టార్‌లింక్‌ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. షరతులకు అంగీకారం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌లింక్‌ అధికారికంగా భారత ప్రభుత్వ విధించిన షరతులను అంగీకరించింది. ఈ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత నియమ నిబంధనలకు అనుగుణంగా పని చేయనున్నట్లు తెలిపింది. పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఇది స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశించేందుకు ఒక కీలక అడుగుగా మారింది. మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో స్టార్‌లింక్‌ ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం, స్టార్‌లింక్‌ వినియోగదారుల డేటాను దేశంలోనే నిల్వ చేయాలి.

Details

కొన్ని షరతులను సడలించాలని విజ్ఞప్తి

అంతేకాకుండా అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలతో ఆ డేటాను పంచుకునే విధంగా ఉండాలని నిబంధనలు పేర్కొన్నాయి. ఈ నియమాలకు స్టార్‌లింక్‌ అంగీకారం తెలిపింది. అయితే ఇటీవల టెలికాం శాఖకి రాసిన లేఖలో కొన్ని షరతులను సడలించాలని విజ్ఞప్తి చేసింది. లైసెన్స్ ఆమోదం అనంతరం, కాలక్రమేణా అన్ని నిబంధనలను పాటిస్తామని వెల్లడించింది. కానీ గ్లోబల్ కంపెనీలైన స్టార్‌లింక్‌, అమెజాన్‌ కూపర్‌కు ఎలాంటి వెసులుబాటు కల్పించమని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది.

Details

భద్రతా పరిశీలనలో స్టార్‌లింక్‌ దరఖాస్తు 

ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు స్టార్‌లింక్‌ దరఖాస్తును సమీక్షిస్తున్నాయి. లైసెన్స్‌ దరఖాస్తు పూర్తియైనా ఇంకా ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి అదనపు వివరణను కోరలేదని తెలుస్తోంది. అనుమతులు లభిస్తే 2025 నాటికి భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా. అయితే పట్టణ ప్రాంతాల్లో స్టార్‌లింక్‌ సేవలు అందడం వల్ల స్థానిక టెలికాం ప్రొవైడర్లు తమ వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉందని టెలికాం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Details

స్టార్‌లింక్‌ ప్లాన్లు.. ధరలు ఎలా ఉండబోతున్నాయ్? 

స్టార్‌లింక్‌ భారత మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లభించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ధర నెలకు రూ. 840-రూ.5,000గా ఉంటుందని అంచనా. ఈ ధర సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కంటే ఎక్కువగానే ఉన్నా కనెక్టివిటీ సమస్యలతో బాధపడుతున్న ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ అందించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.