LOADING...
Stock Market: కలిసొచ్చిన ప్రపంచ సంకేతాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
కలిసొచ్చిన ప్రపంచ సంకేతాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

Stock Market: కలిసొచ్చిన ప్రపంచ సంకేతాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సూచనలు కనిపించడంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచాయి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా ముందుకు సాగుతున్న పరిస్థితి మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది. రోజు ప్రారంభంలోనే ఉత్సాహంగా లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌, ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పెరిగింది. అయితే ఆ తరువాత లాభాల్లో కొంత తగ్గుదల కనిపించి, చివరకు మోస్తరు లాభాలతోనే ముగిసింది.

వివరాలు 

బంగారం ధర ఔన్సుకు 4545 డాలర్లు 

ప్రారంభంలో సెన్సెక్స్‌ 77,257.27 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,913.50) లాభాల్లో ప్రారంభమైంది. రోజులో గరిష్ఠంగా 77,910.75 పాయింట్లను తాకింది. చివరకు 355.90 పాయింట్లు పెరిగి 77,269.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 121.75 పాయింట్లు పెరిగి 24,119.30 వద్ద ముగిసింది.ఇక రూపాయి విలువ డాలరుతో పోలిస్తే మరింత బలహీనమై 95.08 వద్ద తన చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరింది. సెన్సెక్స్‌ సూచీలోని షేర్లలో అదానీ పోర్ట్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌,రిలయన్స్‌,లార్సన్ అండ్ టుబ్రో,ఎటర్నల్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌,కోటక్ మహీంద్రా బ్యాంక్‌,టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌,ఐటీసీ,ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 113డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధర ఔన్సుకు 4545డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement