LOADING...
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 567 పాయింట్లు జంప్‌ అయిన సెన్సెక్స్‌ 
567 పాయింట్లు జంప్‌ అయిన సెన్సెక్స్

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 567 పాయింట్లు జంప్‌ అయిన సెన్సెక్స్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. గత ఆరు రోజులపాటు నిరంతర లాభాలు సాధించిన సూచీలు, శుక్రవారం స్వల్ప విరామం తీసుకున్న తర్వాత, ఈ వారాన్ని మళ్లీ సానుకూలంగా ప్రారంభించాయి. అమెరికాలో అంచనాల కంటే తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావడం మన సూచీలకు కలిసొచ్చింది. దీని ప్రభావంగా, 2025లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను రెండుసార్లు తగ్గించే అవకాశం ఉన్నట్టు విశ్లేషకుల అంచనాలు బలపడ్డాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే, భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, అమెరికా-చైనా దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్‌ ఉత్సాహాన్ని పెంచాయి.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 65.49డాలర్లు 

ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్‌ 84,211.88 గత ముగింపు స్థాయి నుండి 84,297.39 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో తెరుచుకుంది. రోజు మొత్తం లాభదాయకంగా కొనసాగి,ఇంట్రాడేలో 84,932.08పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 566.96 పాయింట్లు పెరిగి 84,778.84 వద్ద సెషన్‌ ముగిసింది. నిఫ్టీ కూడా 170.90 పాయింట్ల లాభంతో 25,966.05వద్ద స్థిరపడింది.రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 88.25గా నమోదైంది. సెన్సెక్స్‌-30 సూచీలో భారతి ఎయిర్‌టెల్‌,రిలయన్స్‌,ఎటెర్నల్‌,ఎస్‌బీఐ,టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ షేర్లు గణనీయంగా రాణించాయి. మరోవైపు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బీఈఎల్‌,ఇన్ఫోసిస్‌,బజాజ్‌ ఫైనాన్స్‌,అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 65.49డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4044 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.