LOADING...
stock market: ఐటీ షేర్ల పతనంతో స్టాక్‌ మార్కెట్‌కు భారీ దెబ్బ.. రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి

stock market: ఐటీ షేర్ల పతనంతో స్టాక్‌ మార్కెట్‌కు భారీ దెబ్బ.. రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో సూచీలపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. అమెరికాలో జనవరి నెలకు సంబంధించి అంచనాలను మించి జాబ్స్‌ డేటా వెలువడటంతో మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. ఈ డేటా నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. దీనికి తోడు ఐటీ రంగాన్ని ఏఐకు సంబంధించిన ఆందోళనలు ఇంకా వెంటాడుతుండటం పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. ఇటీవల వరుస లాభాలతో గరిష్ఠాల వద్దకు చేరిన మార్కెట్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమూ సూచీలపై భారంగా మారింది.

వివరాలు 

భారీ నష్టాలను చూసిన ప్రముఖ ఐటీ షేర్లు

ఐటీ స్టాక్స్‌పై ఆంత్రోపిక్‌కు సంబంధించిన భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జాబ్స్‌ డేటా కూడా ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించని పక్షంలో అమెరికన్‌ కంపెనీలు ఖర్చులను కట్టడి చేసే అవకాశం ఉండటంతో, దాని ప్రభావంగా మన ఐటీ సంస్థలకు వచ్చే ఆర్డర్లు తగ్గుతాయన్న ఆందోళనలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇన్ఫోసిస్‌,టీసీఎస్‌,టెక్‌ మహీంద్రా,హెచ్‌సీఎల్‌ వంటి ప్రముఖ ఐటీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు 5 శాతం మేర క్షీణించింది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర తగ్గి, మదుపర్ల సంపదకు గణనీయమైన నష్టం వాటిల్లింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 90.61గా నమోదు 

సెన్సెక్స్‌ ఉదయం 83,968.43 పాయింట్ల వద్ద, క్రితం ముగింపు 84,233.64తో పోలిస్తే నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.ఇంట్రాడేలో 83,516.67 పాయింట్ల వద్ద కనిష్ఠాన్నితాకిన సెన్సెక్స్‌ చివరకు 558.72 పాయింట్ల నష్టంతో 83,674.92 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 146.65 పాయింట్లు తగ్గి 25,807.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.61గా నమోదైంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో టెక్‌ మహీంద్రా,ఇన్ఫోసిస్‌,టీసీఎస్‌,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌,మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ట్రెంట్‌, బీఈఎల్‌,ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 69 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 5064 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement