Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,995
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చమురు ధరలు పెరగడం,అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం ప్రభావంతో సూచీలు రోజంతా ఒత్తిడిలో కదిలాయి. దీంతో సెన్సెక్స్ సుమారు 400 పాయింట్లు తగ్గింది.ఉదయం 77,094 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 77,493 గరిష్ఠాన్ని,76,741 కనిష్ఠాన్ని తాకి, చివరికి 416 పాయింట్ల నష్టంతో 76,886 వద్ద నిలిచింది. నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 23,995 వద్ద ముగిసింది.డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 41 పైసలు తగ్గి 94.56కు చేరింది. నిఫ్టీ సూచీలో ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్,కోల్ ఇండియా, రిలయన్స్, నెస్లే షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతీ సుజుకీ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో నిలిచాయి.
వివరాలు
కారణాలివీ..
మూడు రోజుల వరుస నష్టాల అనంతరం సోమవారం లాభాలు నమోదు కావడంతో మదుపర్లు మంగళవారం లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. బ్యాంకింగ్, సమాచార సాంకేతిక, రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో చమురు ధరలు వేగంగా పెరిగి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లను దాటింది. విదేశీ సంస్థాగత మదుపర్లు వాటాలను విక్రయించడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే మంగళవారం ఉత్పన్న ఒప్పందాల గడువు ముగియడం కూడా నష్టాలకు కారణమైంది.