Stock Market: స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. సెన్సెక్స్ 1695 పాయింట్ల జంప్.. నిఫ్టీ @ 23,600
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ ఉత్సాహంతో పరుగులు పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అమెరికా-ఇరాన్ మధ్య త్వరలో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆశలు,ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లలో కొత్త జోష్‌ను నింపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచే లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్.. గత ముగింపు 73,832.55పాయింట్లతో పోలిస్తే 74,709.27 వద్ద ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన సూచీ, ఇంట్రాడేలో 75,608.02పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1,695.40 పాయింట్ల లాభంతో 75,527.95 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 461.30పాయింట్లు ఎగిసి 23,622.90 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.11గా నమోదైంది.
వివరాలు
సెన్సెక్స్ 30
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, ఇండిగో, టైటాన్, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 86 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,224 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
మార్కెట్ జోరుకు కారణాలివే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో త్వరలో శాంతి ఒప్పందం కుదరబోతోందని ప్రకటించారు. వారాంతంలోపు ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముందని, హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో సానుకూల సంకేతాలను పంపింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 90 డాలర్లకు పైగా ట్రేడవుతుండగా, శాంతి ఒప్పందంపై అంచనాల నేపథ్యంలో మళ్లీ 86 డాలర్ల స్థాయికి చేరుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
మార్కెట్ జోరుకు కారణాలివే..
శాంతి ఒప్పందంపై ఆశలతో ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. జపాన్ నిక్కీ సూచీ దాదాపు 3 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 4 శాతం మేర పెరిగాయి. ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ముగియగా, యూరోపియన్ మార్కెట్లు సైతం సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఈ అనుకూల పరిస్థితుల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ కూడా భారీ ర్యాలీ నమోదు చేసింది.