Stock Market: నష్టాలతో మొదలై లాభాలతో ముగిసిన మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో క్రమంగా కోలుకుని లాభాల్లోకి చేరాయి. కంపెనీలు విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల ధోరణులు కూడా దేశీయ సూచీలను నష్టాల నుంచి బయటకు తీసుకువచ్చాయి. ఈ ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ చివరికి స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. గత సెషన్ ముగింపు 83,938 పాయింట్ల వద్ద ఉండగా,సోమవారం ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు తగ్గి మొదలైంది. ఆ తరువాత మరింత క్షీణించి ఒక దశలో 83,609 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది.
వివరాలు
రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.78 వద్ద కొనసాగింది
అయితే, రియల్‌టీ రంగ షేర్లు బలంగా రాణించడంతో మార్కెట్‌కు ఊతం లభించింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు మళ్లీ పుంజుకుని, చివరికి సెన్సెక్స్ 39 పాయింట్ల స్వల్ప లాభంతో 83,978 వద్ద రోజు ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఇదే ధోరణి అనుసరించింది. ప్రారంభ నష్టాల అనంతరం కోలుకుని 41 పాయింట్లు పెరిగి 25,763 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా,శ్రీరామ్ ఫైనాన్స్,హెచ్‌ఎఫ్‌సీఎల్,బ్యాంక్ ఆఫ్ బరోడా,గోద్రేజ్ కన్స్యూమర్ వంటి షేర్లు లాభాలు సాధించాయి. అయితే పతంజలి ఫుడ్స్,మారుతీ సుజుకీ,పేటీఎమ్,కోల్గేట్,అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 461పాయింట్లు పెరిగి లాభాల్లో నిలిచింది.బ్యాంక్ నిఫ్టీ కూడా 325పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. మరోవైపు,రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.78 వద్ద కొనసాగింది.