Stock Market: అంతర్జాతీయ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సూచనల ప్రభావంతో దేశీయ షేర్ మార్కెట్లు సోమవారం లాభాల దిశగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదటి క్షణాల్లోనే సూచీలు సుమారు 0.6 శాతం వరకూ ఎగబాకాయి. సెన్సెక్స్ 457 పాయింట్లు అంటే 0.59 శాతం పెరిగి 77,121 స్థాయిలో కొనసాగుతుండగా,నిఫ్టీ 150 పాయింట్లు అంటే 0.62శాతం లాభంతో 24,047 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. రియల్టీ, ఔషధ,సమాచార సాంకేతిక,వాహన,బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లకు బలంగా మారింది. ప్రారంభ సెషన్‌లో నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 23,945 వద్ద,సెన్సెక్స్ 191 పాయింట్ల పెరుగుదలతో 76,856 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. రంగాల వారీగా పరిశీలిస్తే రియల్టీ,ఔషధ,సమాచార సాంకేతిక,వాహన, ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీలు 2 శాతం వరకు పెరిగాయి.
వివరాలు
నష్టాల్లో యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు
అయితే యాక్సిస్ బ్యాంక్,శ్రీరామ్ ఫైనాన్స్,బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రం నష్టాలను నమోదు చేశాయి. మధ్యస్థ కంపెనీలు, చిన్న కంపెనీల సూచీలు కూడా సుమారు 1శాతం వరకూ పెరిగి మార్కెట్లలో ఉత్సాహాన్ని ప్రతిబింబించాయి. అస్థిరతను సూచించే ఇండియా విక్స్ 2శాతానికి పైగా తగ్గి 19.24 స్థాయికి చేరింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నిఫ్టీకి 23,800 నుంచి 23,900 మధ్య మద్దతు ఉండగా,24,200వద్ద నిరోధం ఉంది. అమెరికా కేంద్ర బ్యాంక్ సమావేశం,ముఖ్య ఆర్థిక గణాంకాలు,అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాల ఆర్థిక ఫలితాలపై మదుపరులు దృష్టి పెట్టారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 107డాలర్లకు పైగా పెరగడం, రూపాయి బలహీనత,మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్లపై ఒత్తిడిని పెంచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.