Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. గతవారం నష్టాల్లో ట్రేడైన సూచీలు, ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో సూచీలు ముందుకు దూసుకెళ్లాయి.
ఫలితంగా, సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్ల మేర లాభపడగా, నిఫ్టీ మళ్లీ 22,500 పాయింట్లకు పైగా స్థిరపడింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం 73,830.03 పాయింట్ల వద్ద (గత ముగింపు 73,828.91) స్థిరంగా ప్రారంభమైంది.
కొద్ది సమయానికే లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 74,376.35 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సూచీ, చివరికి 341.04 పాయింట్ల లాభంతో 74,169.95 వద్ద ముగిసింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.26 డాలర్లు
నిఫ్టీ కూడా 111.55 పాయింట్ల లాభంతో 22,508.75 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి 86.82గా నమోదైంది.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఐటీసీ, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.26 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 3004 డాలర్ల పైగా ట్రేడవుతోంది.