
Stock Market :నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,160
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య మన సూచీలు నష్ట బాటలో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తులపై అదనంగా 100% సుంకాలు విధించే నిర్ణయం తీసుకున్న కారణంగా మదుపర్లు ఎక్కువ అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.32 గంటల వద్ద సెన్సెక్స్ 418 పాయింట్లు నష్టపోయి 82,082 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 25,160 వద్ద కదలాడుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 88.76 వద్ద ఉంది.
వివరాలు
ఏ షేర్లు ఎలా..?
సెన్సెక్స్ సూచీలో ఆసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభంలో ట్రేడవుతున్నాయి. ఇక టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, లార్సెన్ అండ్ టూబ్రో షేర్లు నష్టంలో ఉన్నాయి. ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగియగా, నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేశీయంగా కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు, భారత్, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకంగా మారనున్నాయి. హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల ఫలితాలు త్వరలో వెలువడనుండగా, ఆ షేర్లపై మదుపర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు.