Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి, చివరకు నష్టాల్లో స్థిరపడ్డాయి. ఐటీ స్టాక్స్ రాణించినప్పటికీ, ఇతర రంగాలకు చెందిన షేర్లలో మాత్రం ఉత్సాహం కనపడలేదు. నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేటి సాయంత్రం విడుదల కానున్న నేపథ్యంలో, మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్ ఈ ఉదయం 81,476.76 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, కొద్ది సేపు లాభాల్లో కదలాడింది.
బంగారం ఔన్సు ధర 2747 డాలర్లు
అయితే, తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 81,211.64 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి, 236.18 పాయింట్ల నష్టంతో 81,289.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.87గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ వంటి షేర్లు నష్టాల్లో ముగియగా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలను నమోదుచేశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.68 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.