LOADING...
Stock Market: అమెరికా-ఇరాన్‌ శాంతి సంకేతాలతో లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అమెరికా-ఇరాన్‌ శాంతి సంకేతాలతో లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Market: అమెరికా-ఇరాన్‌ శాంతి సంకేతాలతో లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో పాటు దేశీయంగా రూపాయి మారకం విలువ బలపడటం, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లకు ఊతమిచ్చాయి. రోజు ప్రారంభం నుంచే లాభాల్లో కదిలిన సూచీలు మధ్యాహ్నం సమయంలో మరింత ఊపందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా ఎగబాకినా.. చివరికి కొంత లాభాలను కోల్పోయి మోస్తరు పెరుగుదలతో ముగిసింది. నిఫ్టీ మాత్రం 23,700 మార్క్‌కు ఎగువన నిలిచింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపు 75,183.36 పాయింట్లతో పోలిస్తే 75,260.39 వద్ద లాభాలతో ప్రారంభమైంది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 105.07 డాలర్లు 

రోజంతా సానుకూల ధోరణిలోనే కొనసాగిన సూచీ..ఇంట్రాడేలో 75,810.97 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 231.99 పాయింట్లు పెరిగి 75,415.35 వద్ద స్థిరపడింది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 64.60 పాయింట్లు లాభపడి 23,719.30 వద్ద ముగిసింది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 63 పైసలు బలపడి 95.73కు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో ట్రెంట్‌,యాక్సిస్‌ బ్యాంక్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు ఎక్కువ లాభాలను నమోదు చేశాయి. మరోవైపు సన్‌ ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బీఈఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 105.07 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 4,532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement