Stock Market :అంచనాలు తారుమారు .. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..భారీ నష్టం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవ్వడంతో సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 4197 పాయింట్ల నష్టపోయి 72,271 దగ్గర ముగియగా.. నిఫ్టీ 1300 పాయింట్లు నష్టపోయి 21,963 దగ్గర ముగిసింది. అన్ని రంగాలు భారీ నష్టాలను చవిచూశాయి.స్టాక్ మార్కెట్లకు మంచిరోజులొస్తాయని.. ఇక తిరుగులేదని.. ఎన్నెన్నో కథనాలు.. ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్ లు ఒక్కసారిగా ఢమాల్ అయిపోయాయి. సూచీలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఊహించని రీతిలో దెబ్బతిన్నాయి. మదుపర్ల సంపద దాదాపు రూ.35 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఒక్కసారిగా తలకిందులవ్వడంతో స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి అధోపాతాళానికి పడిపోయాయి
స్టాక్ మార్కెట్ ఢమాల్
స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని రీతిలో ఈ ఒక్కరోజే భారీ నష్టాన్ని చవిచూసింది. ఎన్డీయే కూటమి మెజారిటీ మార్కుతో పోలిస్తే భారీ వ్యత్యాసం లేకపోవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వరంగ సంస్థల్లో తీసుకున్న నిర్ణయాల్లో భారీ మార్పులు చేయవచ్చనే వాదనలున్నాయి. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి.