Stock Market: ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. స్టాక్ మార్కెట్లు భారీ పతనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజుల లాభాల తర్వాత నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియా పరిస్థితులు పైకి ప్రశాంతంగా కనిపించినా.. లోలోపల ఉద్రిక్తతలు కొనసాగుతుండటం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణతో ఉద్రిక్తతలు తగ్గినట్లే అనిపించినా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ కఠినమైంది. దీనికి ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడం అంతర్జాతీయంగా చమురు ధరలను పెంచింది. ఈ పరిణామాలు మార్కెట్లపై ఒత్తిడి తెచ్చాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలతో సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్ ఉదయం నష్టాల్లోనే ప్రారంభమై రోజంతా అదే ధోరణి కొనసాగించింది. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ధర 98.42 డాలర్లు
ఇంట్రాడేలో కనిష్ఠాన్ని తాకిన తర్వాత చివరకు గణనీయ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని 23,800 దిగువకు చేరింది.చివరికి సెన్సెక్స్ 931 పాయింట్లు కోల్పోయి 76,631 వద్ద ముగియగా.. నిఫ్టీ 222 పాయింట్లు తగ్గి 23,775 వద్ద నిలిచింది. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 92.62 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌లో ఇండిగో,ఎల్ అండ్ టీ, ఎటర్నల్,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా పడిపోయాయి. మరోవైపు బీఈఎల్,పవర్ గ్రిడ్,ఎన్టీపీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఎగసిపడ్డాయి. కాల్పుల విరమణ తర్వాత తగ్గిన బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ పెరిగి బ్యారెల్‌కు 98.42 డాలర్లకు చేరింది. బంగారం ఔన్స్ ధర 4728 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.