LOADING...
SSY Scheme : ఆడపిల్ల కోసం అద్భుత పథకం.. 1.5 లక్షలు పెట్టుబడితో లక్షలు సంపాదించే అవకాశం!
ఆడపిల్ల కోసం అద్భుత పథకం.. 1.5 లక్షలు పెట్టుబడితో లక్షలు సంపాదించే అవకాశం!

SSY Scheme : ఆడపిల్ల కోసం అద్భుత పథకం.. 1.5 లక్షలు పెట్టుబడితో లక్షలు సంపాదించే అవకాశం!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? అయితే ఆలస్యం చేయకుండా ఆమె భవిష్యత్తు కోసం ఇప్పుడే డబ్బులు కూడబెట్టడం ప్రారంభించాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువు,పెళ్లి కోసం ముందుగానే ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన మంచి అవకాశం అందిస్తోంది. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో నడుస్తుంది. అందువల్ల పెట్టుబడిపై ఎలాంటి ప్రమాదం ఉండదు. పైగా, ఇందులో పెట్టిన డబ్బుపై పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ఆడపిల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ పొదుపు పథకం ప్రస్తుతం ఏడాదికి 8.2 శాతం వడ్డీని అందిస్తోంది.

వివరాలు 

గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం

ఈ పథకంలో కనీసంగా ఏడాదికి రూ.250 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎప్పుడైనా ఖాతా ప్రారంభించవచ్చు. అయితే చాలా మంది తల్లిదండ్రులకు ఒక సందేహం ఉంటుంది. 10 ఏళ్ల వయస్సులో ఖాతా ప్రారంభిస్తే అది ఎప్పుడు పూర్తవుతుంది? ఈ పథకం కాలపరిమితి 21 సంవత్సరాలు. అంటే, పుట్టిన వెంటనే ఖాతా ప్రారంభిస్తే 21 ఏళ్లకు అది పూర్తవుతుంది. అదే 10 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే 21 సంవత్సరాల తర్వాత, అంటే ఆమెకు 31 ఏళ్లు నిండినప్పుడు మొత్తం డబ్బు చేతికి వస్తుంది.

వివరాలు 

ఖాతాను దేశంలో ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం

ఈ పథకం 2015 జనవరి 22న ప్రారంభమైంది. ఆడపిల్లల విద్య, పెళ్లి ఖర్చుల కోసం ముందుగానే డబ్బు కూడబెట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. పెళ్లి సమయంలో వచ్చే ఖర్చులకు కూడా ఈ నిధులను వినియోగించుకోవచ్చు. ఒక్కో ఆడపిల్లకు ఒక ఖాతా మాత్రమే తెరవాలి. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే రెండు ఖాతాలు తెరవొచ్చు. అయితే కవలలు లేదా ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టిన సందర్భంలో తగిన ధృవపత్రాలు సమర్పిస్తే మరిన్ని ఖాతాలకు అనుమతి ఉంటుంది. ఈ ఖాతాను దేశంలో ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంది. ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను నిర్వహిస్తారు. 18ఏళ్లు పూర్తయ్యాక ఆమె స్వయంగా అవసరమైన పత్రాలు సమర్పించి ఖాతాను నిర్వహించవచ్చు.

Advertisement

వివరాలు 

పూర్తి 21 సంవత్సరాల పాటు వడ్డీ

ఖాతా ప్రారంభానికి అవసరమైన పత్రాలలో ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం,ఆధార్ సంఖ్య,పాన్ కార్డు లేదా నిర్దిష్ట పత్రం అవసరం ఉంటుంది. ఈ ఖాతాను బ్యాంకులు లేదా తపాలా కార్యాలయాల్లో ప్రారంభించవచ్చు. ఈ పథకం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదన సాధ్యమే.ఉదాహరణకు,ప్రతి ఏడాది రూ.1.5 లక్షలు చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.22.5 లక్షలు అవుతుంది. అయితే వడ్డీ మాత్రం పూర్తి 21 సంవత్సరాల పాటు లభిస్తుంది. ఈ కాలంలో లభించే మొత్తం వడ్డీ సుమారు రూ.49,32,119 వరకు ఉంటుంది. చివరికి ఖాతా పూర్తయ్యే సమయానికి మొత్తం రూ.71,82,119 వరకు చేతికి అందుతుంది. అంటే, క్రమంగా పెట్టుబడి పెడితే మీ ఆడపిల్ల భవిష్యత్తు కోసం లక్షల్లో నిధులు సిద్ధమవుతాయి.

Advertisement