
Swiggy hikes platform fee: ప్లాట్‌ఫాం ఫీజు పెంచిన స్విగ్గీ.. కొత్త రేటు ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ తన ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫాం ఫీజును పెంచింది. ఇప్పటివరకు రూ.12గా ఉన్న ఈ ఫీజును ఇప్పుడు రూ.14కి పెంచినట్లు తెలుస్తోంది. పండుగ సీజన్‌లో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరగడం, డెలివరీ సిబ్బందికి అధిక చెల్లింపులు చేయాల్సి రావడం, ఆపరేటింగ్ ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఎక్కువ డిమాండ్ ఉన్న సమయాల్లో మాత్రమే ఈ పెంపు అమల్లో ఉండి, తర్వాత మళ్లీ పాత రేటుకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్విగ్గీ, యూనిట్ ఎకనామిక్స్‌ను మెరుగుపరిచే ఉద్దేశంతో 2023 ఏప్రిల్ నుంచి ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది.
Details
ప్రతికూల ప్రభావం చూపలేదన్న కంపెనీ
అప్పటి నుంచి ఈ ఫీజును దశలవారీగా పెంచుతూ వస్తోంది. ఆసక్తికరంగా ఫీజు పెంపు ఆర్డర్ వాల్యూమ్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని కంపెనీ చెబుతోంది. వినియోగదారులకు రూ.2 అదనపు భారం పెద్దగా అనిపించకపోయినా, రోజుకు లక్షల ఆర్డర్లు డెలివర్ చేసే స్విగ్గీకి మాత్రం ఈ పెంపు గణనీయమైన అదనపు ఆదాయాన్ని అందించనుంది