Oil tanker: రష్యన్ చమురు కొనుగోళ్లకు బ్రేక్.. సూపర్ ట్యాంకర్ల రేట్లు రికార్డ్ స్థాయికి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈతాజా నిర్ణయంతో రష్యన్ చమురును కొనుగోలు చేసే దేశాలు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించాయి. దాంతో ముడిచమురును రవాణా చేసే సూపర్ ట్యాంకర్ల అద్దె రేట్లు ఒక్కసారిగా భారీగా ఎగబాకి, ఐదేళ్లలో ఎప్పుడూ లేని రికార్డ్ స్థాయికి చేరాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. పుతిన్ అప్రజాస్వామికంగా నడుపుతున్న యుద్ధానికి ప్రతిస్పందనగా రాస్‌నెఫ్ట్, లుకాయిల్ వంటి రష్యా అతిపెద్ద చమురు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో,ఈ కంపెనీల నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత,చైనా రిఫైనరీలు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాయి.
వివరాలు
ఈ ఏడాది మొత్తంలో దాదాపు 576 శాతం పెరుగుదల
రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించుకుంటూ, డిమాండ్ తీర్చుకోవడానికి మధ్యప్రాచ్యం, అమెరికా వంటి ఇతర ఉత్పత్తిదారుల నుంచి దిగుమతులు పెంచినట్లు ఆ కథనాలు తెలిపాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుంచి నిర్దిష్ట మార్గాల ద్వారా చైనాకు రోజుకు 2 మిలియన్ బారెళ్ల చమురును తీసుకెళ్లగల సూపర్ క్యారియర్ల అద్దె గత వారం నాటికి రోజుకు 1,37,000 డాలర్లకు చేరింది. అంటే ఈ ఏడాది మొత్తంలో దాదాపు 576 శాతం పెరుగుదల. 2020 తర్వాత ఇది అత్యధిక స్థాయిగా నమోదైందని పేర్కొన్నారు.
వివరాలు
రోజువారీ దిగుమతులు 4 లక్షల బ్యారెళ్ల వరకు తగ్గొచ్చు
ఇక మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు పూర్తిగా ఆగకపోయినా, సమీప భవిష్యత్తులో గణనీయంగా తగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. ఈ ఏడాదిలో భారత్ రోజుకు సగటున 1.7 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడిచమురును దిగుమతి చేసుకుంది. రాయితీలు పెరగడంతో గత నెలలో కొనుగోళ్లు రోజుకు 1.8 నుంచి 1.9 మిలియన్ బ్యారెళ్ల మధ్య నమోదయ్యి ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. అయితే డిసెంబర్, జనవరిలో మాత్రం దిగుమతుల్లో పెద్దఎత్తున కోత పడే అవకాశం ఉంది. సమీప కాలంలో రోజువారీ దిగుమతులు 4 లక్షల బ్యారెళ్ల వరకు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.