LOADING...
Tata Motors Q1 results: టాటా మోటార్స్‌ Q1 ఫలితాలు.. లాభంలో 62% తగ్గుదల 
టాటా మోటార్స్‌ Q1 ఫలితాలు.. లాభంలో 62% తగ్గుదల

Tata Motors Q1 results: టాటా మోటార్స్‌ Q1 ఫలితాలు.. లాభంలో 62% తగ్గుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను టాటా మోటార్స్ ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.4,003 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25 ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,587 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 62.2% తక్కువ. అన్ని వ్యాపార విభాగాల్లో అమ్మకాల తగ్గుదల ప్రధాన కారణమని సంస్థ వెల్లడించింది. అదనంగా, అమెరికా విధించిన టారిఫ్‌లు జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (JLR) లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.

వివరాలు 

తగ్గిన కార్యకలాపాల ఆదాయం 

మొత్తం కార్యకలాపాల ఆదాయం కూడా తగ్గింది. 2024-25 ఇదే కాలంలో రూ.1,07,102 కోట్లుగా ఉన్న ఆదాయం, 2025-26 తొలి త్రైమాసికంలో రూ.1,04,407 కోట్లకు పడిపోయింది. "అమెరికా టారిఫ్‌ల అంశంలో స్పష్టత రావడం, అలాగే పండుగల సీజన్‌లో డిమాండ్ పెరగడం వలన, రాబోయే త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. వచ్చే అక్టోబరులో కంపెనీని వాణిజ్య వాహనాలు, ప్రయాణికుల వాహనాలు అనే రెండు విభాగాలుగా విభజించనున్నందున, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది" అని కంపెనీ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ తెలిపారు.

వివరాలు 

జేఎల్‌ఆర్‌పై అమెరికా టారిఫ్‌ల ప్రభావం 

2025 ఏప్రిల్‌-జూలై మధ్య జేఎల్‌ఆర్‌ ఆదాయం 9.2% తగ్గి 6.6 బిలియన్‌ పౌండ్లకు పరిమితమైంది. బ్రిటన్‌, ఐరోపా దేశాల్లో తయారైన కార్లపై అమెరికా సుంకాలు విధించడం వల్ల ఈ తగ్గుదల చోటుచేసుకుంది. అయితే, బ్రిటన్‌-అమెరికా, అలాగే ఐరోపా సమాఖ్య-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరినందున, రాబోయే త్రైమాసికాల్లో జేఎల్‌ఆర్‌ ఫలితాలు మెరుగుపడే అవకాశముందని సంస్థ నమ్ముతోంది.

వివరాలు 

దేశీయ మార్కెట్లో అమ్మకాల పరిస్థితి 

ఏప్రిల్‌-జూన్‌ కాలంలో దేశీయంగా ప్రయాణికుల వాహనాల (PV) అమ్మకాలు,గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 10.1% తగ్గి 1,24,800 యూనిట్లకు చేరాయి. అల్ట్రోజ్‌,హ్యారియర్‌,సఫారీ మోడళ్లలో మార్పులు చేయడానికి వాటి ఉత్పత్తి, అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. పరిశ్రమవ్యాప్తంగా కూడా అమ్మకాలు తగ్గినట్లు గుర్తు చేసింది.వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా 6% తగ్గి 88,000 యూనిట్లకు పడిపోయాయి. అయితే, టాటా మోటార్స్, జేఎల్‌ఆర్‌ తయారు చేస్తున్న విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి అవసరమైన అరుదైన భూ అయస్కాంతాల (Rare Earth Magnets) కొరత ప్రస్తుతం ప్రభావం చూపడం లేదని, సమీప భవిష్యత్తులో కూడా ఆ సమస్య ఎదురయ్యే అవకాశం లేదని సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ అంచనా వేశారు.