Page Loader
Tata Play- Airtel Digital TV: ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, టాటా ప్లే విలీనం చర్చలు
ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, టాటా ప్లే విలీనం చర్చలు

Tata Play- Airtel Digital TV: ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, టాటా ప్లే విలీనం చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కంటెంట్‌ పంపిణీ సంస్థ టాటా ప్లే (Tata Play),భారతీ ఎయిర్‌ టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ (Airtel Digital TV) త్వరలో విలీనం కానున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లైవ్‌ స్ట్రీమింగ్‌ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో డైరెక్ట్‌-టు-హోమ్‌ (DTH) సేవల వినియోగం క్రమంగా తగ్గిపోతున్నది. ఈ పరిస్థితిలో టాటా ప్లే, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ విలీనం కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆంగ్ల మీడియా సంస్థ 'ఎకనామిక్‌ టైమ్స్‌' తన కథనంలో వెల్లడించింది.

వివరాలు 

20 మిలియన్ల DTH కనెక్షన్లు 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, టాటా ప్లే విలీనం షేర్ల మార్పిడి (స్టాక్ స్వాప్) ద్వారా జరగనుంది. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత, సంయుక్త సంస్థలో ఎయిర్‌టెల్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండే అవకాశముందని సమాచారం. ఈ విలీనం ద్వారా ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. మొబైల్ సేవలకు సంబంధించిన కాకుండా ఇతర విభాగాల ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇది దోహదపడనుంది. విలీనంతో టాటా ప్లేకు చెందిన దాదాపు 20 మిలియన్ల DTH కనెక్షన్లను ఎయిర్‌టెల్ తన సేవలలోకి తీసుకురానుంది. డీ2హెచ్‌ వినియోగం తగ్గుతూ, వినియోగదారులు డిజిటల్ వేదికలవైపు మారుతున్న నేపథ్యంలో, ఈ విలీనం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

రెండవ అతిపెద్ద విలీనం

భారతదేశంలోని అతిపెద్ద డీటీహెచ్‌ సేవాదారు టాటా స్కై ఇటీవల టాటా ప్లేగా పేరు మార్చుకుంది. ఇది న్యూస్ కార్ప్‌తో జాయింట్ వెంచర్‌గా స్థాపించబడింది. 2019లో జరిగిన ఒప్పందంలో, టాటా ప్లేలో కొంతశాతం వాటాను వాల్ట్ డిస్నీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న టాటా ప్లే-ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ విలీన ఒప్పందం, 2016లో జరిగిన టాటా డీ2హెచ్‌-డిష్ టీవీ విలీనం తర్వాత రెండవ అతిపెద్ద విలీనంగా నిలవనుంది. విలీనమైన కొత్త సంస్థను ఎయిర్‌టెల్ సీనియర్ మేనేజ్‌మెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సంయుక్త సంస్థలో డిస్నీకి కూడా వాటా కలిగివుంటుందని నివేదిక పేర్కొన్నది.