Tata Sons AGM: టాటా సన్స్ ఏజీఎం వాయిదా.. కంపెనీ చరిత్రలో తొలిసారి ఇలా!
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) అనుకున్నట్లుగానే వాయిదా పడింది. సమావేశం నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో వాటాదారుల ప్రతినిధులు హాజరు కాకపోవడంతో కోరమ్ పూర్తి కాలేదు. టాటా సన్స్ చరిత్రలో ఏజీఎం ఈ కారణంతో వాయిదా పడటం ఇదే తొలిసారి. మళ్లీ ఏ తేదీన ఏజీఎం నిర్వహించాలనే విషయంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 18న ముంబయిలోని బాంబే హౌస్‌లో సమావేశం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో పాటు కొందరు బోర్డు సభ్యులు నేరుగా హాజరయ్యారు. నోయల్ టాటా, మెహ్లీ మిస్త్రీ తదితరులు ఆన్‌లైన్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.
వివరాలు
అవసరమైన కోరమ్ లేకపోవడంతో ఏజీఎం వాయిదా
అయితే టాటా సన్స్‌లో కీలక వాటాదారుగా ఉన్న సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టీటీ) తరఫున ప్రతినిధిని నామినేట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన నిషేధం ఇందుకు కారణమైంది. దీంతో ట్రస్ట్ ప్రతినిధి సమావేశానికి హాజరు కాలేకపోయారు.
అవసరమైన కోరమ్ లేకపోవడంతో ఏజీఎంను వాయిదా వేయాల్సి వచ్చింది.
మరో కీలక వాటాదారు సంస్థ అయిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ కూడా ఈ పరిణామాన్ని ముందుగానే టాటా సన్స్‌కు తెలియజేసింది.
దీంతో ఏజీఎం వాయిదా పడే అవకాశం ముందే స్పష్టమైంది. ప్రస్తుతం బోర్డు తదుపరి సమావేశ తేదీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వివరాలు
ఏజీఎంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు
వాస్తవానికి ఈ ఏజీఎంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ చంద్రశేఖరన్‌ను మరోసారి డైరెక్టర్‌గా నియమించే (రీనామినేట్) ప్రతిపాదనను పరిశీలించాల్సి ఉంది.
అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ స్టాండలోన్, ఏకీకృత ఆర్థిక ఖాతాలను పరిశీలించి ఆమోదించాల్సి ఉంది.
వాటాదారులకు చెల్లించాల్సిన డివిడెండ్‌ను కూడా ఈ సమావేశంలో ప్రకటించాల్సి ఉంది.