Tata Sons Listing: టాటా గ్రూప్‌లో అధికార పోరు.. టాటా సన్స్ లిస్టింగ్‌పై ముదిరిన విభేదాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. గ్రూప్‌కు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలా? వద్దా? అనే అంశంపై కీలక వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్‌కు రాబోయే రెండు వారాలు అత్యంత కీలకంగా మారాయి. శుక్రవారం టాటా ట్రస్టుల బోర్డు సమావేశం జరగనుండగా, వచ్చే వారం టాటా సన్స్ బోర్డు భేటీ కానుంది. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు గ్రూప్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్, కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
లిస్టింగ్‌పై నోయెల్ టాటా వ్యతిరేకత.. ఆర్‌బీఐ నిబంధనలే కారణం
ఈ వివాదానికి ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయం. టాటా సన్స్‌ను 'అప్పర్ లేయర్' నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)గా ఆర్‌బీఐ వర్గీకరించింది.
ఈ కేటగిరీకి సంబంధించిన నిబంధనల ప్రకారం టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, టాటా సన్స్‌లో 66శాతం వాటా కలిగిన టాటా ట్రస్టుల ఛైర్మన్ నోయెల్ టాటా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కంపెనీ లిస్టింగ్‌కు వెళ్తే గ్రూప్‌పై ప్రస్తుత నియంత్రణ దెబ్బతినే ప్రమాదం ఉందని నోయెల్ టాటా ఆందోళన చెందుతున్నారు.
అంతేకాకుండా, లాభాలే ప్రధాన లక్ష్యంగా మారితే సమాజ సేవ,దాతృత్వానికి ప్రాధాన్యం ఇచ్చే టాటా గ్రూప్ సంప్రదాయమైన 'టాటా వే'కు విఘాతం కలుగుతుందని భావిస్తున్నారు.
వివరాలు
నోయెల్ టాటా అభ్యంతరాలు బేఖాతరు
మరోవైపు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఇతర బోర్డు సభ్యులు మాత్రం ఆర్‌బీఐ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని చెబుతున్నారు.
కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయడం వల్ల ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
గత సెప్టెంబర్‌లో జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ విభేదాలు తొలిసారిగా బహిర్గతమయ్యాయి.
కంపెనీ లిస్టింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్న ప్రతిపాదనను, చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలన్న నిర్ణయాన్ని నోయెల్ టాటా వ్యతిరేకించారు.
అయితే, ఆయన అభ్యంతరాలను బోర్డు పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లింది. దీంతో గ్రూప్‌లో విభేదాలు మరింత పెరిగాయి.
వివరాలు
కీలక భేటీపై ఆసక్తి
ఆ తర్వాత ఈ వివాదం టాటా సన్స్ బోర్డు సమావేశాలకే పరిమితం కాకుండా టాటా ట్రస్టుల స్థాయికి కూడా చేరింది.
ట్రస్టుల సభ్యులైన వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ వంటి వారు సంస్థ పాలనకు సంబంధించిన అంశాలపై నోయెల్ టాటాను ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా టాటా సన్స్ లిస్టింగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు నోయెల్ టాటా సవతి సోదరుడు జిమ్మీ టాటా సైతం చంద్రశేఖరన్ నియామకాన్ని, కంపెనీ లిస్టింగ్ ప్రతిపాదనను సమర్థించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం జరగనున్న టాటా ట్రస్టుల సమావేశంపై ఆసక్తి నెలకొంది.
ఈ భేటీలో ఆర్‌బీఐ నిబంధనలు, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన ఆంక్షలు, దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించే బడ్జెట్లపై చర్చించే అవకాశం ఉంది.
వివరాలు
లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు రెండు మార్గాలు
అయితే, ఈ సమావేశంలో ఎలాంటి ఓటింగ్ నిర్వహించే అవకాశాలు లేవని సమాచారం.
లిస్టింగ్‌కు అనుకూలంగా ఉన్నవారు, వ్యతిరేకిస్తున్నవారు తమ అభిప్రాయాలను వెల్లడించుకునే వేదికగానే ఈ సమావేశం ఉండవచ్చని తెలుస్తోంది.
టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా చేసేందుకు నోయెల్ టాటా రెండు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మొదటి ప్రతిపాదన ప్రకారం టాటా ఎలక్ట్రానిక్స్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థలను టాటా సన్స్‌లో విలీనం చేయాలని భావిస్తున్నారు.
తద్వారా టాటా సన్స్ కేవలం హోల్డింగ్ కంపెనీగా కాకుండా, వ్యాపార కార్యకలాపాలను కూడా నిర్వహించే 'హోల్డింగ్-ఆపరేటింగ్ కంపెనీ'గా మారుతుంది.
ఇలా చేయడం వల్ల ప్రస్తుత నిబంధనల ప్రకారం తప్పనిసరి లిస్టింగ్ నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వివరాలు
లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు రెండు మార్గాలు
రెండో ప్రతిపాదనలో భాగంగా టాటా సన్స్‌లో మైనారిటీ వాటాదారుగా ఉన్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కు తమ వాటాలను దశలవారీగా విక్రయించేందుకు అనుమతించాలని యోచిస్తున్నారు.
అయితే, ఈ రెండు ప్రతిపాదనలు అమలులోకి రావాలంటే టాటా సన్స్ బోర్డుతో పాటు ఆర్‌బీఐ ఆమోదం కూడా తప్పనిసరి. ఈ అనుమతులు లభిస్తాయా లేదా అన్నది ప్రస్తుతం కీలకంగా మారింది.
వివరాలు
వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం
టాటా గ్రూప్‌లో నెలకొన్నఈ అంతర్గత వివాదం సంస్థకు సంబంధించిన పలు కీలక కార్యకలాపాలపై ప్రభావం చూపుతోంది.
సుమారు 185 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే ఈ భారీ వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
మరోవైపు మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన ఆంక్షల కారణంగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహణ,వాటాదారులకు డివిడెండ్ల చెల్లింపు వంటి అంశాలు కూడా సంక్లిష్టంగా మారాయి.
టాటా గ్రూప్‌లో నెలకొన్న ఈ ప్రతిష్టంభనకు రాబోయే బోర్డు సమావేశాలతో పరిష్కారం లభిస్తుందా? లేక విభేదాలు మరింత ముదురుతాయా?అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా టాటా సన్స్ లిస్టింగ్‌పై అతిపెద్ద వాటాదారైన టాటా ట్రస్టులు ఎలాంటి వైఖరి తీసుకుంటాయోనని కార్పొరేట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.