
Tata: విమాన ప్రమాద బాధితుల కోసం టాటా ట్రస్ట్.. రూ.500 కోట్లతో ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విషాదమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు టాటా సన్స్ రూ.500 కోట్లతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రస్ట్‌కు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో వచ్చే జూలై చివరినాటికి అధికారికంగా నమోదు పూర్తి కానుందని సమాచారం. టాటా సన్స్ బోర్డు ఈ ట్రస్ట్ ఏర్పాటును ఇప్పటికే ఆమోదించగా, ఏఐ 171 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, గాయపడిన వారికి సాయం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించింది. సంబంధిత కుటుంబాల డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఎయిరిండియాకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు అధికారి ఒకరు వెల్లడించారు.
Details
మృతులకు భారీ సాయం
జూన్ 12న జరిగిన విమాన ప్రమాద బాధిత కుటుంబాలను సంప్రదించి, అవసరమైన ధ్రువపత్రాలను సేకరించేందుకు ఎయిరిండియాకు సూచించాం. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలతో పాటు గాయపడినవారు కూడా ఈ ట్రస్ట్‌లో భాగమవుతారని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ 787-8 విమానం ఏఐ 171 అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా చనిపోయారు. ప్రమాద సమయంలో విమానంలో ఏర్పడిన వేడి సుమారు 1,500 డిగ్రీల సెల్సియస్ (2700°F) కు చేరుకోవడంతో DNA శాంపిళ్లను సేకరించడం, పరీక్షించడం కష్టతరంగా మారింది.