ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారుల షాక్..రూ.లక్ష కోట్ల షోకాజ్ నోటీసులు జారీ
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. పన్ను ఎగవేతకు సంబంధించి సదరు నోటీసులు జారీ చేశామని జీఎస్టీ సీనియర్ అధికారి బుధవారం వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి భారత్‌లో నమోదైన విదేశీ గేమింగ్ కంపెనీల డేటా ఇంకా అందలేదన్నారు. మరోవైపు విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి భారతదేశంలో నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ జీఎస్టీ చట్టానికి సవరణలు చేసింది.
నోటీసులు అందుకున్న Dream 11 హోస్ట్, డెల్టా కార్ప్
ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై అత్యధికంగా 28 శాతం వస్తువు సేవల పన్ను (జీఎస్టీ)ని విధిస్తున్నారు. ఈ మేరకు ఆగస్టులో జీఎస్టీ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు దాదాపుగా రూ.లక్ష కోట్ల విలువైన నోటీసులను జీఎస్‌టీ అధికారులు అందించారు. మరోవైపు Dream 11 లాంటి ఆన్‌లైన్ గేమింగ్‌ల హోస్ట్, డెల్టా కార్ప్ లాంటి క్యాసినో ఆపరేటర్‌లు నోటీసులు అందుకున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో పన్నులు తక్కువగా చెల్లించిన ఆరోపణల మేరకు ఈ నోటీసులు అందాయి. రూ, 21 వేల కోట్ల జీఎస్టీ ఎగవేతపై గత ఏడాది సెప్టెంబర్‌లో గేమ్‌స్‌క్రాఫ్ట్ కంపెనీకి నోటీసు అందింది.