Tax notices to TCS Employees: టీసీఎస్ ఇండియా ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (IT dept) పన్ను డిమాండ్ నోటీసులు పంపింది. సుమారు 30,000 నుండి 40,000 మందికి ఈ నోటీసులు అందినట్లు సమాచారం. మూలం వద్ద పన్ను కోత (TDS) లో వ్యత్యాసాలు ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో, రూ. 50 వేల నుండి రూ. 1 లక్ష వరకు చెల్లించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. సాఫ్ట్‌వేర్ లో లోపం కారణంగా, టీడీఎస్‌కు సంబంధించిన వివరాలు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సరిగా అప్‌డేట్ కాకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది.
అంతర్గతంగా ఉద్యోగులకు టీసీఎస్ నోటీసులు
2023-24 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన టీడీఎస్ వివరాలు లేనందున, సెప్టెంబర్ 9న ఐటీ చట్టం సెక్షన్ 143(1) ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ కారణంగా, ఉద్యోగులకు రావాల్సిన రిఫండ్లు కూడా నిలిపివేయబడినట్లు సమాచారం. ఈ నోటీసులపై టీసీఎస్ స్పందిస్తూ, అంతర్గతంగా ఉద్యోగులకు నోటీసులు పంపించింది. ఈ పన్ను డిమాండ్లకు సంబంధించిన చెల్లింపులను చేయొద్దని సూచించింది. సంస్థ నుంచి తదుపరి సమాచారం వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలిపింది. ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని టీసీఎస్ తెలిపింది.