
variable pay: మందగమనం ఉన్నప్పటికీ.. Q1లో 70% సిబ్బందికి TCS 100% వేరియబుల్ పే అలవెన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు వేరియబుల్ పే అలవెన్స్‌ను ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మంది ఉద్యోగులకు నూరు శాతం వేరియబుల్ పే చెల్లించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. మిగిలిన ఉద్యోగులకు మాత్రం వారి పని విభాగాల ప్రదర్శన ఆధారంగా వేరియబుల్ పే చెల్లింపులు ఉంటాయని తెలిపింది. అత్యధికంగా వున్న ఉద్యోగులకు వంద శాతం వేరియబుల్ పే చెల్లింపులు చేస్తున్నది వరుసగా రెండోసారి అనే విషయం టీసీఎస్ వెల్లడించింది.
వివరాలు
C2 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగులకు నూరు శాతం వేరియబుల్ పే చెల్లింపులు
''క్వార్టర్లీ వేరియబుల్ పే ప్రణాళిక ప్రకారం C2 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగులకు నూరు శాతం వేరియబుల్ పే చెల్లింపులు జరుగుతాయి. C3 గ్రేడ్, ఆ పై ఉన్న ఉద్యోగులకు వారి బిజినెస్ యూనిట్ల పనితీరు ఆధారంగా వేరియబుల్ పే నిర్ణయిస్తారు'' అని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో వివరించారు. టీసీఎస్‌లో ఉద్యోగుల విభజన వివిధ గ్రేడ్‌లుగా కొనసాగుతోంది. మొదట వై-లెవెల్ ట్రైనీలతో ప్రారంభమవుతుంది. తరువాత సిస్టమ్ ఇంజనీర్లు (C1)గా ఉంటారు. అనంతరం C2, C3, C4, C5 గ్రేడ్‌లు ఉంటాయి. సాధారణంగా C3, దానికి పైగా ఉన్న బ్యాండ్‌లలో సీనియర్ మేనేజర్లు, వ్యాపార యూనిట్ హెడ్‌లు ఉండటం గమనార్హం.