Page Loader
TCS New Bench Policy: బెంచ్‌ పీరియడ్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చిన టీసీఎస్‌ 
బెంచ్‌ పీరియడ్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చిన టీసీఎస్‌

TCS New Bench Policy: బెంచ్‌ పీరియడ్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చిన టీసీఎస్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తాజాగా ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ప్రకారం,ప్రతి ఉద్యోగి సంవత్సరానికి కనీసం 225 బిల్ల్డ్‌బిజినెస్‌ డేస్‌ (అంటే క్లయింట్‌ ప్రాజెక్టులపై పని చేసిన రోజులు) పూర్తి చేయాలని నిబంధన విధించారు. ఇకపై ఉద్యోగులు బెంచ్‌ మీద ఉండే గరిష్ట సమయం 35 రోజులకు పరిమితం చేశారు. ఈ మార్పులు జూన్ 12వ తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.ఈ చర్యలతో సంస్థ లక్ష్యం - ఉద్యోగుల పనితీరు మెరుగుపరచడమే కాకుండా,వర్క్‌ఫోర్స్‌ను మరింత సమర్థంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్లు 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' తన కథనంలో పేర్కొంది.

వివరాలు 

 "బిల్ల్డ్‌ డేస్‌" ఏడాదికి 225కి పరిమితం

టీసీఎస్‌ తీసుకొచ్చిన ఈ విధానం ఉద్యోగులు పని చేయకుండా ఖాళీగా ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించడానికే రూపుదిద్దుకుంది. ఐటీ రంగంలో "బిల్ల్డ్‌ డేస్‌" అనే పదం ప్రాజెక్టులపై పని చేసిన రోజులకు సూచికగా ఉంటుంది. టీసీఎస్ ఈ రోజులను ఏడాదికి 225కి పరిమితం చేసింది. అంటే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఇన్నిరోజులు ప్రాజెక్టులపై పని చేయాలి. ఇకపోతే, ప్రాజెక్ట్‌ కేటాయించబడక ఖాళీగా ఉండే సమయాన్ని"బెంచ్‌ పీరియడ్‌"గా వ్యవహరిస్తారు. ఈ పీరియడ్‌ను ఇప్పుడు 35 రోజులకు పరిమితం చేశారు.దీని కింద,ఒక ఉద్యోగి చాలా కాలం పాటు ప్రాజెక్ట్‌ లేకుండా ఉండరాదు. అలా జరిగితే అతడి జీతం, పదోన్నతులు, కెరీర్‌ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని టీసీఎస్‌ తన పాలసీ పత్రంలో స్పష్టం చేసింది.

వివరాలు 

డిపార్ట్‌మెంట్‌ మార్గనిర్దేశం ప్రకారమే తాజా పాలసీ

ఎవరికి ఏ ప్రాజెక్ట్‌ కేటాయించాలన్నదే కాకుండా, వాళ్ల నైపుణ్యాలు ఏ ప్రాజెక్ట్‌కు సరిపోతాయన్న విషయాన్ని రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ (RMG) పరిశీలిస్తుంది. దీనికి గ్లోబల్‌ హెడ్‌గా చంద్రశేఖరన్‌ రామ్‌కుమార్‌ ఉన్నారు. ఈ డిపార్ట్‌మెంట్‌ మార్గనిర్దేశం ప్రకారమే తాజా పాలసీ రూపొందించబడింది. ఒక అసోసియేట్‌కు ప్రాజెక్ట్‌ కేటాయించకపోతే, అతడు తను ఏ ప్రాజెక్ట్‌కు సరిపోతానని భావిస్తున్నాడో, అటువంటి ప్రాజెక్టును పొందేందుకు ఆయా యూనిట్‌ లేదా రీజనల్‌ ఆర్‌ఎంజీతో చర్చలు జరపాలి. ఇది ఉద్యోగి బాధ్యతగా పేర్కొన్నారు.

వివరాలు 

బెంచ్‌పై ఉన్నపుడూ ఉద్యోగులు కార్యాలయానికి హాజరుకావాలి

అలాగే, బెంచ్‌పై ఉన్న సమయంలో ఉద్యోగులు సంస్థ అందిస్తున్న ఐఎవాల్వ్‌, ఫ్రెస్కో ప్లే, వీఎల్‌ఎస్‌, లింక్డిన్‌ వంటివి వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగించి తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. RMG సూచించిన శిక్షణ సెషన్లకు తప్పనిసరిగా హాజరుకావాలి. బెంచ్‌పై ఉన్నపుడూ ఉద్యోగులు కార్యాలయానికి హాజరుకావాలి. ఈ సమయంలో వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ నుండి మినహాయింపులు లేదా వర్క్‌ ఫ్లెక్సిబిలిటీ వర్తించవు. ఇంకా, ఒక ఉద్యోగికి దీర్ఘకాలం పాటు ఎలాంటి ప్రాజెక్ట్‌ కేటాయించకపోతే, అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందన్న విషయాన్ని కూడా ఈ పాలసీలో స్పష్టంగా పేర్కొన్నారు.