
Flight Operations: ఉద్రిక్తతలు తగ్గుముఖం.. తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
మే 15 వరకు వీటిని మూసివేయాలని తొలుత నిర్ణయించినా తాజా పరిణామాల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో ముందస్తుగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు స్థిరంగా ఉండటంతో పౌర విమానయాన కార్యకలాపాలను వెంటనే పునరుద్ధరించనున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రయాణికులు తమ ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
Details
విమానాశ్రయాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభం
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరపడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే.
దీంతో భద్రతా కారణాల చేత చండీగఢ్, శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భుటార్, కిషన్‌గఢ్, పటియాలా, శిమ్లా, ధర్మశాల, భటిండా, జైసల్మేర్, జోధ్‌పూర్, లేహ్, బికనేర్, పఠాన్‌కోట్, జమ్మూ, జామ్‌నగర్, రాజ్‌కోట్, భుజ్ వంటి విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు.
తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా ప్రశాంతంగా మారాయి.
ఈ నేపథ్యంలో విమానాశ్రయాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.