Page Loader
Budget 2025: మన బడ్జెట్‌ తయారీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వీరే..!
మన బడ్జెట్‌ తయారీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వీరే..!

Budget 2025: మన బడ్జెట్‌ తయారీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వీరే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

సార్వత్రిక ఎన్నికల తర్వాతి పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్ణయాలపై చాలా ఆసక్తి నెలకొంది. ఆమె కొత్తపాత వారితో కూడిన బడ్జెట్‌ బృందం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ బృందంలోని ముఖ్యమైన వ్యక్తులు వీరే: తుహిన్ కాంత పాండే: తుహిన్‌ ప్రస్తుతం దేశ ఫైనాన్స్‌ అండ్‌ రెవెన్యూ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన 1987 ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. పన్ను రాయితీలను సమతుల్యం చేయడంతో పాటు ఆదాయాలను తగ్గించకుండా చూడటమే ఆయన ప్రధాన బాధ్యత. ఆయన బడ్జెట్‌కు కొన్ని నెలల ముందు ఈ బాధ్యత స్వీకరించారు. ఈసారి ఆదాయపు పన్ను చట్టాల పునర్‌ వ్యవస్థీకరణను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

వివరాలు 

అజేయ్‌ సేథ్‌: 

ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజేయ్‌ సేథ్‌ ఈ సారి బడ్జెట్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు. 1987 కర్ణాటక బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఆయన. బడ్జెట్‌ ప్రతిపాదనల తుది కాపీని తేల్చేది ఈ శాఖలోనే. వృద్ధి, ఆర్థిక వనరుల నిర్వహణ, వ్యయాల నియంత్రణ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం ఆయన బాధ్యత. అనంత్‌ నాగేశ్వరన్‌: ప్రస్తుతం చీఫ్‌ ఎకానమిస్ట్‌గా పనిచేస్తున్న వి. అనంత్‌ నాగేశ్వరన్‌ బృందం ఆర్థిక సర్వేను తయారు చేస్తోంది. గతంలో ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా పనిచేశారు. వృద్ధిని పెంపొందించడంతో పాటు సంస్కరణల ఫలితాలను అంచనా వేయడం, గ్లోబలైజేషన్‌ ఎదుర్కొనే మార్గాలపై ఆయన బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

వివరాలు 

మనోజ్‌ గోవిల్‌:

1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి మనోజ్‌ గోవిల్‌ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలో పనిచేశారు. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం చేసే వ్యయాలు సమర్థవంతంగా వాడేందుకు ఆయన బృందం పని చేస్తోంది. ఎం నాగరాజు: ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్యదర్శిగా ఉన్న ఎం నాగరాజు 1993 త్రిపుర కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఈ శాఖ రుణాల జారీ, డిపాజిట్ల సమీకరణ, ఫిన్‌టెక్‌ల నియంత్రణ, బీమా కవరేజీల పెంపు, డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుదల వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది.

వివరాలు 

అరుణిష్‌ చావ్లా:

ఆర్థిక మంత్రి బృందంలో కొత్త సభ్యుడైన అరుణిష్‌ చావ్లా 1992 బిహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన ఫార్మాస్యూటికల్స్‌ విభాగంలో పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుత ఆస్తుల నిర్వహణ, డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ వంటి అంశాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఐడీబీఐ బ్యాంకు సహా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.