PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన
కేంద్ర ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటాలను విక్రయించాలన్న ఆలోచనలో ఉందని సంబంధిత వర్గాల నుండి సమాచారం అందింది. ప్రభుత్వ ప్రమేయం తగ్గించి, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ప్రకారం వాటాలను 25 శాతానికి పెంచేందుకు ఈ చర్యలపై చర్చ జరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లోని వాటాలను కేంద్రం విక్రయించే దిశగా అడుగులు వేస్తోందని రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఈ ప్రక్రియకు ఆర్థిక మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని సమాచారం.
పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతం
సెబీ నిబంధనల ప్రకారం, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతం ఉండటం తప్పనిసరి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నిబంధనల నుండి 2026 ఆగస్టు వరకు మినహాయింపు లభించింది. సకాలంలో నిబంధనలు అమలు చేయడంపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ విక్రయాలు ఓపెన్ మార్కెట్ ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా మార్కెట్ లైక్విడిటీ పెరిగి, ప్రైవేటు పెట్టుబడిదారుల కోసం కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, రానున్న రోజుల్లో ఇది బ్యాంకింగ్ రంగంలో మార్పులకు దారితీసే ముఖ్యమైన పరిణామంగా మారే అవకాశం ఉంది.