రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ. 2,000 నోటును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. అయితే ఈ గడువు మరో 5రోజులో ముగియనుంది. ఈ క్రమంలో ఇంకా ఎవర వద్దైనా రూ.2వేల నోట్లు ఉంటే త్వరితగతి మార్చుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్‌బీఐ మే 19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితి లేదని, అయితే కేవైసీ (నో యువర్ కస్టమర్) నియమ నిబంధనలు వర్తిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది.
19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ నోట్ల మార్పిడి
రూ.2000 నోట్లను నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ జమ చేయాలనుకునే వారికి ఆదాయపు పన్ను నిబంధనలలోని రూల్ 114B వర్తిస్తుందని చెప్పింది. వ్యక్తులు బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఒకే రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినప్పుడు వారి పాన్ (శాశ్వత ఖాతా నంబర్)ను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 30వరకు ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలలో కూడా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి ఇవి మార్చుకోవడానికి ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదు. అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి. లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ఐడీ ప్రూఫ్‌అడుగుతున్నాయి.