Wholesale Inflation: దేశంలో ద్రవ్యోల్బణం సెగ.. 98 శాతం కుటుంబాలపై నిత్యావసరాల ధరల భారం!
ఈ వార్తాకథనం ఏంటి
సామాన్యుడికి షాక్.. వంట నూనె నుంచి పాలు, కూరగాయల వరకు ధరల మంటలు! ఖర్చులు తగ్గించుకుంటున్న కుటుంబాలు దేశంలోని కోట్లాది కుటుంబాలకు నెలవారీ కిరాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి. వంట నూనె, కూరగాయలు, తృణధాన్యాలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. దీంతో బయట తినడం, షాపింగ్, వినోదం వంటి ఖర్చులతో పాటు పొదుపునకు కూడా కోత పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరికొన్ని కుటుంబాలు నిత్యావసర వస్తువులను తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం లేదా తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయ బ్రాండ్లకు మారడం చేస్తున్నాయి. తాజాగా టోకు ద్రవ్యోల్బణం భారీగా పెరగడం చూస్తుంటే.. రానున్న రోజుల్లోనూ ఈ ధరల భారం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
వివరాలు
అక్టోబర్‌లో 12.3 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం (Wholesale Inflation) 12.3 శాతానికి చేరింది.
వరుసగా రెండో నెలలోనూ రెండంకెల స్థాయిలో నమోదైంది. అంటే వస్తువులు దుకాణాలకు, వినియోగదారులకు చేరకముందే వాటి ధరలు పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 74,311 మంది పాల్గొన్న లోకల్ సర్కిల్స్ సర్వేలోనూ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించింది.
సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 10 వరకు ఈ సర్వే నిర్వహించారు. గత 12 నెలలతో పోలిస్తే నిత్యావసర వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నామని 98 శాతం మంది వెల్లడించారు.
వీరిలో దాదాపు 92 శాతం మంది కనీసం 10 శాతం ఖర్చులు పెరిగాయని తెలిపారు.
వివరాలు
15 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగాయి
మరో 79 శాతం మంది తమ నెలవారీ వ్యయం 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగినట్లు చెప్పారు.
మరోవైపు అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన 6 శాతం గరిష్ఠ పరిమితిని దాటి 6.09 శాతానికి చేరింది.
దీంతో కుటుంబ బడ్జెట్లపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
టోకు, రిటైల్ స్థాయిల్లోనూ ధరలు పెరుగుతుండటంతో సామాన్య కుటుంబాలు ఈ భారాన్ని ఇంకెంతకాలం భరించగలవన్న ప్రశ్న తలెత్తుతోంది.
వివరాాలు
కుటుంబ బడ్జెట్లపై పెరుగుతున్న భారం
లోకల్ సర్కిల్స్ సర్వేలో భాగంగా 1.34 లక్షల స్పందనలను పరిగణనలోకి తీసుకున్నారు.
నిత్యావసర వస్తువుల కోసం ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న ప్రశ్నకు 61 శాతం మంది ప్రతి నెలా 20 శాతానికి పైగా వ్యయం పెరిగినట్లు తెలిపారు.
మరో 18 శాతం మంది ఖర్చులు 15-20 శాతం పెరిగాయని చెప్పారు. 13 శాతం మంది 10-15శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడించారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా దాదాపు అన్ని విభాగాల్లో కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఏయే వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని అడిగిన మరో ప్రశ్నకు 21,637 మంది స్పందించారు.
ఇందులో ఒకటి కంటే ఎక్కువ వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
వివరాలు
పప్పులు, కందిపప్పు ధరలు పెరిగాయి
ఈ వివరాల ప్రకారం నెయ్యి, వెన్న, వంట నూనెల ధరలు పెరిగాయని 75 శాతం మంది తెలిపారు.
తాజా కూరగాయల ధరలు పెరిగినట్లు 73 శాతం మంది పేర్కొన్నారు. బియ్యం, గోధుమలు, ఇతర తృణధాన్యాల ధరలు పెరిగాయని 71 శాతం మంది చెప్పారు.
పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులతో పాటు తాజా పండ్ల ధరలు పెరిగినట్లు 65 శాతం మంది వెల్లడించారు.
పప్పులు, కందిపప్పు వంటి వాటి ధరలు పెరిగాయని 62 శాతం మంది తెలిపారు.
వివరాలు
ఏయే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి?
లోకల్ సర్కిల్స్ సర్వేలో 21,637 మంది స్పందనల ఆధారంగా
నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయని తెలిపినవారు
నెయ్యి, వెన్న, వంట నూనెలు 75%
తాజా కూరగాయలు 73%
బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు 71%
పాలు, పాల ఉత్పత్తులు 65%
తాజా పండ్లు 65%
పప్పులు, కందిపప్పు 62%
ఈ గణాంకాలను పరిశీలిస్తే సాధారణ కుటుంబాల నెలవారీ వినియోగంలో కీలకమైన అనేక వస్తువుల ధరలు ఒకేసారి పెరుగుతున్నట్లు అర్థమవుతోంది.
వంట నూనెలు, ధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పప్పుల ధరలు ఏకకాలంలో పెరిగితే.. ఒక వస్తువుకు బదులుగా మరొకటి కొనుగోలు చేసే అవకాశం కూడా కుటుంబాలకు పరిమితమవుతుంది.
వివరాలు
74 శాతం మంది
బయట తినడం, షాపింగ్, వినోదం వంటి అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు తెలిపారు.
50 శాతం మంది: నిత్యావసర వస్తువులను గతంలో కంటే తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.
39 శాతం మంది: పాలు, పాల ఉత్పత్తులు, ఇతర పోషకాహార పదార్థాల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు.
39 శాతం మంది: పండ్లు, కూరగాయలు తక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
39 శాతం మంది: కుటుంబ ఖర్చుల కోసం పొదుపు సొమ్మును వినియోగించడం లేదా అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు.
37 శాతం మంది: తక్కువ ధరకు లభించే బ్రాండ్లు లేదా ప్రత్యామ్నాయ వస్తువులకు మారినట్లు చెప్పారు.
8 శాతం మంది: తమ ఖర్చులు, వినియోగ అలవాట్లలో చెప్పుకోదగ్గ మార్పులేదని వెల్లడించారు.
వివరాలు
జీవనశైలి మార్పులకే పరిమితం కాలేదు
ఈ వివరాలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణం ప్రభావం కేవలం జీవనశైలి మార్పులకే పరిమితం కాలేదని తెలుస్తోంది.
హోటళ్లకు వెళ్లడం తగ్గించడం, షాపింగ్ వాయిదా వేయడం ద్వారా కొంతవరకు కుటుంబ బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు.
కానీ పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల వినియోగాన్ని తగ్గించుకోవాల్సి రావడం ఆహార అవసరాలపైనా ధరల భారం పడుతోందని సూచిస్తోంది.
వివరాలు
టోకు ద్రవ్యోల్బణం పెరిగితే వినియోగదారులపై ప్రభావం ఎలా?
వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు చెల్లించే ధరల్లో మార్పులను రిటైల్ ద్రవ్యోల్బణం సూచిస్తుంది.
అదే టోకు ద్రవ్యోల్బణం (WPI)సరఫరా వ్యవస్థలో ముందస్తు దశలో వస్తువుల ధరల్లో వచ్చే మార్పులను తెలియజేస్తుంది.
టోకు ధరలు నిరంతరం పెరిగితే తయారీదారులు, పంపిణీదారులు, రిటైలర్లు తమపై పడుతున్న అదనపు భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.
తాజా టోకు ధరల సూచీలు ఇదే ఒత్తిడి పెరుగుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధనం, విద్యుత్ ఖర్చులు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
అక్టోబర్‌లో మొత్తం ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం దాదాపు 33 శాతానికి చేరింది. సెప్టెంబర్‌లో ఇది సుమారు 26శాతంగా ఉంది. ముడి చమురు, సహజ వాయువు విభాగంలో ధరల పెరుగుదల మరింత ఎక్కువగా నమోదైంది.
వివరాలు
తయారీ రంగంలోనూ పెరుగుతున్న ధరల ఒత్తిడి
ఈ విభాగంలో టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 57.3 శాతంగా ఉండగా.. అక్టోబర్‌లో 70.8 శాతానికి పెరిగింది.
గతేడాది ఇదే సమయంలో ఈ విభాగంలో ధరలు 7.2 శాతం తగ్గాయి.
గత ఏడాది తక్కువ స్థాయిలో ధరలు నమోదవడం కూడా ఈ ఏడాది వార్షిక పెరుగుదల భారీగా కనిపించడానికి ఒక కారణంగా నిలిచింది.
వివరాలు
విభాగంలోనూ ద్రవ్యోల్బణం 9.5 శాతానికి చేరింది.
వస్త్రాలు, పొగాకు ఉత్పత్తులు, రసాయనాలు, రబ్బరు వస్తువులు, లోహాలు, విద్యుత్ పరికరాల తయారీ వంటి విభాగాల్లో ధరల పెరుగుదల నమోదైంది.
తయారీ సంస్థలకు ముడిసరుకులు, ఉత్పత్తి వ్యయాలు పెరిగితే.. ఆ భారంలో కొంత భాగాన్ని తమ ఉత్పత్తుల ధరల రూపంలో వినియోగదారులపై మోపే అవకాశం ఉంటుంది.
అయితే ఎంత మేరకు ధరలు పెంచాలన్నది మార్కెట్ డిమాండ్, పోటీ, లాభాల మార్జిన్లు, అదనపు ఖర్చులను సంస్థలు ఎంతవరకు భరించగలవన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ అంశంపై బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ బిజినెస్ స్టాండర్డ్‌తో మాట్లాడారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు ఆ భారాన్ని నిరవధికంగా భరించడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
కోర్ విభాగంపైనా పడే అవకాశం
ద్రవ్యోల్బణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు ముడిసరుకుల ధరల పెరుగుదలలో కొంత భాగాన్ని మాత్రమే కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేశాయని పేర్కొన్నారు.
దీంతో రానున్న నెలల్లో కంపెనీలు విక్రయ ధరలను పెంచితే.. ఆ ప్రభావం క్రమంగా రిటైల్ ద్రవ్యోల్బణంలోని కోర్ విభాగంపైనా పడే అవకాశం ఉంది.
అయితే ఈ ధరల బదిలీ ఎంతవరకు, ఎప్పుడు జరుగుతుందన్నది కంపెనీల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
వివరాలు
డిసెంబర్‌లో ఆర్‌బీఐ నిర్ణయంపై ఆసక్తి
మొత్తంగా చూస్తే.. టోకు ధరలు పెరుగుతున్నప్పటికీ వాటి పూర్తి ప్రభావం ఇంకా వినియోగదారులకు చేరకపోవచ్చు.
కానీ ఉత్పత్తి వ్యయాలు ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని ధరల పెరుగుదలలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదే జరిగితే నెలవారీ కిరాణా ఖర్చులకే కాకుండా కుటుంబాల పొదుపు, అప్పులు, మొత్తం వినియోగ వ్యయాలపైనా ప్రభావం పడవచ్చు.
ఇప్పటికే ఏడాది క్రితంతో పోలిస్తే నిత్యావసరాల కోసం గణనీయంగా ఎక్కువ ఖర్చు చేస్తున్నామని కుటుంబాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగితే సామాన్యులకు ఆర్థిక భారం తప్పకపోవచ్చు.
ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితికి మించి ద్రవ్యోల్బణ సూచీలు నమోదవుతున్న నేపథ్యంలో డిసెంబర్‌లో జరగనున్న తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశంపై అందరి దృష్టి నెలకొంది.