LOADING...
West Asian tensions: యుద్ధ ప్రభావం.. విమాన సరకు రవాణా 'ప్రియం'
యుద్ధ ప్రభావం.. విమాన సరకు రవాణా 'ప్రియం'

West Asian tensions: యుద్ధ ప్రభావం.. విమాన సరకు రవాణా 'ప్రియం'

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ విమాన సరకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. కొన్ని మార్గాల్లో ఎయిర్‌ కార్గో ధరలు దాదాపు 70శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన ప్రయాణాలతో పాటు సముద్ర రవాణాపైనా ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా సరుకులు పంపాల్సిన కంపెనీలు ఖరీదైన విమాన రవాణాను ఆశ్రయించాల్సి వస్తోంది. అదేసమయంలో విమాన ఇంధనమైన ఏటీఎఫ్‌ ధరలు పెరగడంతో రవాణా వ్యయం మరింత పెరిగింది. ఫలితంగా ప్రపంచంలోని ముఖ్య ఎయిర్‌ కార్గో హబ్‌లలో కార్యకలాపాలు తగ్గినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా గగనతలం మూసివేత, భద్రతా సమస్యల కారణంగా దక్షిణాసియా-ఐరోపా మధ్య విమాన మార్గాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

Details

హర్మూజ్‌ మార్గమే జనరిక్‌ ఔషధాలకు కీలకం

ఇంకా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో 100కు పైగా కంటెయినర్‌ నౌకలు నిలిచిపోయినట్లు సమాచారం. మన దేశం నుంచి ఐరోపా సమాఖ్య, ఆఫ్రికా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి అరబ్‌ దేశాలకు పంపే తక్కువ ధర కలిగిన జనరిక్‌ ఔషధాలు సాధారణంగా హర్మూజ్‌ జలసంధి మార్గం ద్వారా కంటెయినర్‌ నౌకల్లో తరలిస్తారని ఔషధ సరఫరా వ్యవస్థ నిపుణుడు ప్రశాంత్‌ యాదవ్‌ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఆ ఔషధాలను కూడా విమానాల ద్వారా తరలించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో విలువ పరంగా మూడో వంతు సరుకు రవాణా విమానాల ద్వారానే జరుగుతోంది.

Details

విమాన ఇంధనం ధర రెట్టింపు

ఈ నేపథ్యంలో ఎయిర్‌ కార్గో ఛార్జీలు పెరగడం వల్ల ఆహార పదార్థాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు వంటి అనేక రంగాలపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత విమాన ఇంధనం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. డానిష్‌ కంటెయినర్‌ షిప్పింగ్‌ సంస్థ మారెస్క్‌ ప్రతినిధి మాట్లాడుతూ, తమ ఎయిర్‌ కార్గో సేవలపై ఇంధన సర్‌ఛార్జీలు, అలాగే యుద్ధ ప్రమాద రుసుములు (వార్‌ రిస్క్‌ లెవీలు) విధించాల్సి వస్తోందని తెలిపారు. గగనతలం మూసివేయడంతో విమానయాన సంస్థలు పొడవైన మార్గాల్లో తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో సరకు రవాణా విమానాల సామర్థ్యం తగ్గడమే కాకుండా, ప్రయాణికుల విమానాల్లో తీసుకెళ్లే కార్గో సామర్థ్యంపై కూడా ప్రభావం పడుతోంది.

Advertisement

Details

ఈ కేంద్రాల్లో కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం

ఈ పరిస్థితులు రవాణా ఖర్చులపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌కార్గో హబ్‌లలో దుబాయ్‌, దోహా విమానాశ్రయాలు ముఖ్యమైనవి. యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ కేంద్రాల్లో కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం. రవాణా ధరల విశ్లేషణ సంస్థ జెనెటా చీఫ్‌ ఎయిర్‌ఫ్రైట్‌ అధికారి నైల్‌ వాన్‌ డె వూ మాట్లాడుతూ, కేవలం ఇంధన ధరల పెరుగుదల వల్ల మాత్రమే కాదు, పశ్చిమాసియాలోని కీలక ట్రాన్స్‌షిప్‌మెంట్‌ హబ్‌ల సామర్థ్యం భారీగా తగ్గిపోవడం వల్లే ఎయిర్‌ కార్గో ధరలు పెరిగాయని చెప్పారు.

Advertisement

Details

కొన్ని పరిమితులతోనే విమానాలను నడపాల్సి వస్తోంది

అదేవిధంగా, ఐరోపా దేశాలకు వెళ్లే తమ సరకు రవాణా విమానాలు సాధారణంగా ఇంధనం నింపుకోవడం, అదనపు సరుకు ఎక్కించుకోవడం కోసం దుబాయ్‌లో ఆగుతాయని క్యాథే పసిఫిక్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓ రోనాల్డ్‌ లామ్‌ వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌ నుంచి నేరుగా ఐరోపాలోని గమ్యస్థానాలకు విమానాలు వెళ్లాల్సి వస్తోందన్నారు. మధ్యలో ఇంధనం నింపే అవకాశం లేకపోవడంతో లోడింగ్‌ విషయంలో కొన్ని పరిమితులతోనే విమానాలను నడపాల్సి వస్తోందని ఆయన వివరించారు.

Advertisement