LOADING...
Brickwork Ratings: సొంతింటి కొనుగోళ్లకు ఊపు.. గృహ రంగంలో 7.3% వరకు వృద్ధి
సొంతింటి కొనుగోళ్లకు ఊపు.. గృహ రంగంలో 7.3% వరకు వృద్ధి

Brickwork Ratings: సొంతింటి కొనుగోళ్లకు ఊపు.. గృహ రంగంలో 7.3% వరకు వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సొంత ఇంటి కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోందని బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గృహ రంగం 6.5 నుంచి 7.3 శాతం వరకు వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. వడ్డీ రేట్లు క్రమంగా తగ్గడం, ప్రజల వద్ద ఖర్చుకు మిగిలే ఆదాయం పెరగడం ఈ రంగానికి అనుకూలంగా మారుతున్నాయని బ్రిక్‌వర్క్‌ సీఈఓ మను సెహగల్‌ తెలిపారు. దేశ జీడీపీ వృద్ధి దాదాపు 8.2 శాతంగా కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం నియంత్రిత స్థాయిలో ఉండటం కూడా గృహ మార్కెట్‌కు బలం చేకూరుస్తోందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్టణం, అమరావతి ప్రాంతాల్లో నివాస గృహాల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోందని బ్రిక్‌వర్క్‌ చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ కె.హెచ్‌.పట్నాయక్‌ పేర్కొన్నారు.

వివరాలు 

2034నాటికి తెలంగాణ ఏటా 12 నుంచి 13 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది: బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్

జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ, గ్లోబల్‌ రైజింగ్‌ సమిట్‌ వంటి కార్యక్రమాలు ఈ ప్రాంతాల్లో పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింత పెంచాయని తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగం మంచి ప్రదర్శన చేస్తోందని చెప్పారు. గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలోకి రావడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. రూ.25కోట్లకు మించి రుణాలు పొందే స్తిరాస్తి ప్రాజెక్టులు,ప్రభుత్వ సంస్థలకు బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ రేటింగ్‌ సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో ఐటీ,ఫార్మా రంగాల వృద్ధి నేపథ్యంలో వాణిజ్య స్తిరాస్తికి గణనీయమైన డిమాండ్‌ కనిపిస్తోందన్నారు. 2034నాటికి తెలంగాణ 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే,రాష్ట్రం ఏటా 12 నుంచి 13 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.

Advertisement