
No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు చాలా బ్యాంకులు,ఆర్థిక సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
అయితే ప్రపంచంలో ఎటువంటి వ్యాపారవేత్త అయినా నష్టాన్ని మోయాలనుకునే పనిని చేయడు.
ఇది ఒక మూల సూత్రం.అయితే అలాంటప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ పథకాలను ఎందుకు అందిస్తున్నారు? దీనివల్ల వినియోగదారులకు లాభమా..? లేక ఏదైనా దాగి ఉన్న నష్టమా..? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
ఈ స్కీమ్‌లను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌లు,ఫ్రిడ్జిలు వంటి గృహోపకరణాలను చాలా మంది సొంతం చేసుకుంటున్నారు.
పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా చెల్లించాల్సిన అవసరం లేకుండా,కొంత డౌన్ పేమెంట్ ఇచ్చి,నెలవారీ చెల్లింపులతో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ముఖ్యంగా వడ్డీ లేకుండా ఈఎంఐలతో చెల్లించవచ్చు కాబట్టి, ఇది వినియోగదారులకు బాగా నచ్చిన ఎంపికగా మారుతోంది.
వివరాలు
ఒకవేళ ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం చేస్తే..
ఇంకా, నో కాస్ట్ ఈఎంఐల వివరాలు క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తారు కాబట్టి, ఈ పద్ధతులు క్రెడిట్ స్కోర్ మెరుగుదలకు సహాయపడతాయి.
కానీ ఒకవేళ ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం చేస్తే, ఆ పై వడ్డీ వేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సిబిల్ స్కోర్నూ దెబ్బతీసే అవకాశం ఉంది.
నో కాస్ట్ ఈఎంఐలకు వాస్తవంగా వడ్డీ ఉండే అవకాశం ఉన్నా,ఆ వడ్డీ మొత్తాన్ని సాధారణంగా విక్రేతలు,ఉత్పత్తి తయారీ సంస్థలు (OEMలు), లేదా ఆర్థిక భాగస్వాములు సబ్సిడీ రూపంలో భరిస్తారు.
లేదా అదే వడ్డీని ఉత్పత్తి ధరలోనే కలిపి తీసుకుంటారు. అందువల్ల వినియోగదారుడికి ఇది వడ్డీ లేని రుణంలా అనిపించవచ్చు.
కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్న యువత ఈ స్కీముల వైపు ఆకర్షితులవుతున్నారు.
వివరాలు
క్రెడిట్ స్కోర్‌ను తగ్గించే ప్రమాదం
ఎందుకంటే క్రెడిట్ సులభంగా లభించడమే కాకుండా,ఈఎంఐలను సమయానికి చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవచ్చు.
అయితే,కొన్ని సందర్భాల్లో ఈ నో కాస్ట్ ఈఎంఐలు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.ఎందుకంటే మీరు తరచూ వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ స్కీములను వాడితే, మీ క్రెడిట్ రిపోర్ట్‌లో అనేక ఓపెన్ లోన్ ఖాతాలు కనిపించవచ్చు.
దీని వలన మీరు మల్టిపుల్ ఓపెన్ క్రెడిట్ లోన్స్ తీసుకున్నట్టు చూపబడుతుంది.ఇది క్రెడిట్ స్కోర్‌ను తగ్గించే ప్రమాదం కలిగించవచ్చు.
కాబట్టి, నో కాస్ట్ ఈఎంఐ తేవాలంటే ముందుగా మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
మీ చెల్లింపులు సమయానికి చేస్తే ఇది నిజంగా లాభదాయకమైన వ్యవహారం. కానీ ఒకవేళ మిస్ అయితే మాత్రం తీవ్ర నష్టానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.