మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో (-) 3.48శాతం క్షీణించింది. ఇది మూడేళ్ల కనిష్టస్థాయిని తాకినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది. తృణధాన్యాలు, గోధుమలు, కూరగాయలు, బంగాళాదుంపలు, పండ్లు, గుడ్లు మాంసం, చేపలు, నూనెగింజలు, ఖనిజాలు, ముడి పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు ఇతర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడం వల్లే మే నెలలో ద్రవ్యోల్బణం క్షీణించడానికి ప్రధానం కారణం. వాస్తవానికి ఆర్థికవేత్తలు ఈ నెల 2.35శాతం తగ్గుతుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) -3.48శాతం క్షీణించింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.92 శాతం పడిపోయింది. గతేడాది మేలో డబ్ల్యూపీఐ 16.63 శాతంగా ఉంది.
మే నెలలో 4.25 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
జూలై 2020తర్వాత మొదటిసారిగా ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం నివేదించబడింది. టోకు ద్రవ్యోల్బణం (-)3.37 శాతం మే 2020లో నమోదైంది. ఆ తర్వాత అంత తక్కువ నమోదు కావడం ఇప్పుడే నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 4.25 శాతానికి తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది ఏప్రిల్‌లో 4.7 శాతం, మార్చిలో 5.7 శాతంగా ఉంది. ప్రభుత్వం ప్రతినెలా 14వ తేదీన నెలవారీ ప్రాతిపదికన టోకు ధరల సూచిక సంఖ్యలను విడుదల చేస్తుంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.54 శాతం ఉండగా, మేలో 1.51 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 8.39 శాతంగా ఉండగా, అక్కడి నుంచి క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది.