LOADING...
HDFC Bank: ఏఐ వచ్చినా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలకు కోత ఉండవు 
ఏఐ వచ్చినా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలకు కోత ఉండవు

HDFC Bank: ఏఐ వచ్చినా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలకు కోత ఉండవు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తమ సంస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వల్ల ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేసింది. బ్యాంక్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశిధర్‌ జగదీశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. జెనరేటివ్‌ ఏఐ సహా పలు టెక్నాలజీ రంగాల్లో ప్రస్తుతం ట్రయల్స్‌ చేస్తున్నామని, వాటి ఫలితాలు వచ్చే 18 నుంచి 24 నెలల్లో కనిపిస్తాయని చెప్పారు. ఏఐ వినియోగం పెరిగినా, ఉద్యోగులను తొలగించే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాక్‌ఎండ్‌లో పనిచేస్తున్న సిబ్బందిని అవసరానికి అనుగుణంగా ఫ్రంట్‌ఎండ్‌ లేదా టెక్నాలజీ విభాగాలకు మారుస్తామని తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగాలు కోతకు గురవుతాయనే భయాందోళనల నడుమ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Details

5వేల మంది కొత్త సిబ్బంది నియామకం

గత ఆరు నెలల్లోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సుమారు 5,000 మంది కొత్త సిబ్బందిని నియమించుకుంది. దీంతో సెప్టెంబర్‌ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.20 లక్షలకు చేరింది. భారత ఆర్థిక రంగంలో ఫైనాన్షియల్‌ సర్వీసులకు పెద్ద స్థాయిలో అవకాశాలు ఉన్నాయని, వినియోగదారులతో నేరుగా మమేకమయ్యే ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల అవసరం మరింత పెరుగుతుందని శశిధర్‌ జగదీశ్ తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణలను స్వీకరించడం, కొత్త మోడళ్లను రూపొందించడం ద్వారా బ్యాంక్‌ ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో కొనసాగుతున్న తమ ప్రాజెక్టులను సరైన సమయానికి వెల్లడిస్తామని వెల్లడించారు. బ్యాక్‌ఎండ్‌ సిబ్బందిని తగ్గించకుండా, వారినే ఫ్రంట్‌ఎండ్‌లో వినియోగించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు.