Cement Prices: సిమెంట్ ధరల పతనానికి కారణమిదే.. యెస్ సెక్యూరిటీస్ నివేదిక
సిమెంట్ ధరలు గత 5 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం తీవ్రమైన పోటీ అని 'యెస్ సెక్యూరిటీస్' పేర్కొంది. ప్రతి త్రైమాసికంలో ధరలను పెంచే ప్రయత్నాలు చేసినప్పటికీ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ కొరవడటం వల్ల ధరలు స్థిరంగా ఉండలేకపోతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. సిమెంట్ తయారీదారుల మధ్య తీవ్రమైన పోటీ, మార్కెట్ ఒత్తిడి కారణంగా ధరల పెరుగుదలకు అవకాశమే లేకుండా పోయింది. డిమాండ్ బలహీనంగా ఉండడం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో మందగమనం ఈ పరిస్థితికి దారితీసింది. ధరలు సమీప కాలంలో పెద్దగా పెరిగే అవకాశాలు లేవని ఆ నివేదిక పేర్కొంది.
2026లో సిమెంట్ ధరలు పెరిగే ఛాన్స్
2025 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మరింత తగ్గొచ్చని అంచనా వేసింది. 2026 మధ్య నుంచి మాత్రం డిమాండ్ పెరుగుదలకు అవకాశం ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రోత్సాహం, గ్రామీణ పట్టణ గృహాల పునరుద్ధరణ, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల వంటి కారణంగా పెరిగే ఛాన్స్ ఉంది. దీర్ఘకాలంలో డిమాండ్ మెరుగవుతుందనే ఆశలతో పరిశ్రమ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు తమ వ్యూహాలను తిరిగి పునర్నిర్మించుకోవాల్సి వస్తోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ నిర్మాణ ప్రాజెక్టుల ప్రోత్సాహం ఈ రంగానికి జీవం పోస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.