ఎక్స్ కి పోటీగా థ్రెడ్స్: వెబ్ వెర్షన్ ని లాంచ్ చేయనున్న మెటా
ఎలాన్ మస్క్ ఎక్స్ కి పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్, మార్కెట్లో నిలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరో వారంలో థ్రెడ్స్ వెబ్ వెర్షన్ ను లాంచ్ చేయాలని మెటా సంస్థ ఆలోచిస్తోందని వాల్ స్ట్రీట్ వర్గాల సమాచారం. ప్రస్తుతం మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్న థ్రెడ్స్ యాప్ ని అందరికీ వినియోగంలోకి తీసుకువచ్చేలా పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇన్స్ టా గ్రామ్, థ్రెడ్స్ సీఈవో ఆడమ్, మొస్సేరి తెలియజేసిన ప్రకారం, థ్రెడ్స్ వెబ్ వెర్షన్ లాంచ్ పనులు జరుగుతున్నాయట. అంతర్గతంగా వెబ్ వెర్షన్ ని చెక్ చేస్తున్నామని సీఈవో చెప్పుకొచ్చారు.
10మిలియన్ల యాక్టివ్ యూజర్లు కలిగిన థ్రెడ్స్
థ్రెడ్స్ యాప్ జులై 5వ తేదీన లాంచ్ అయ్యింది. మొదట్లో థ్రెడ్ యాప్ కి యూజర్లు చాలామంది వచ్చారు. కానీ ఆ తర్వాత అమాంతం థ్రెడ్స్ యూజర్లు తగ్గిపోయారు. ప్రస్తుతం 10మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు థ్రెడ్స్ లో ఉన్నారు. ఇటు ఎక్స్ యాప్ లో 363. 7మిలియన్ల మంది యూజర్లు యాక్టివ్ గా ఉన్నారు. థ్రెడ్స్ యాప్ వైపు వినియోగదారులు రావడం కోసం అనేక ఆకర్షణలు చేస్తుంది మెటా సంస్థ. థ్రెడ్స్ లో సరికొత్త ఫీఛర్లను తీసుకొస్తున్నారు. ఇప్పుడు రాబోయే వెబ్ వెర్షన్ ద్వారా యూజర్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఎలాన్ మస్క్ ఎక్స్ తో పోటీ పడుతున్న కంపెనీ, వినియోగదారులకు ఎలాంటి ఫీఛర్లను అందిస్తుందో చూడాలి.