Section 301: ట్రంప్ కొత్త ట్రేడ్ స్టెప్.. భారత్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మళ్లీ వాణిజ్య యుద్ధాన్ని వేడెక్కించారు. అమెరికా సుప్రీంకోర్టు ఆయన అమలు చేసిన భారీ టారిఫ్ విధానాన్ని రద్దు చేసిన తర్వాత, ఇప్పుడు భారత్ సహా 15 దేశాలపై 'అన్యాయ వాణిజ్య పద్ధతులు' ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులు అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద జరుగనున్నాయి. అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. సెక్షన్ 301 ప్రకారం ఇతర దేశాలు అక్రమ వాణిజ్య విధానాలు పాటిస్తున్నట్లు తేలితే, ఆ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు విధించవచ్చు.
వివరాలు
సెక్షన్ 301 దర్యాప్తు అంటే..
ముఖ్యంగా తయారీ రంగంలో అధిక ఉత్పత్తి సామర్థ్యం, మార్కెట్ అవసరాలకు మించిన ఉత్పత్తి వంటి అంశాలను ఈ దర్యాప్తులో పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యం స్థానిక లేదా ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడం కనిపిస్తోంది. మార్కెట్ అవసరాలకు సంబంధం లేకుండా తయారీ పెరుగుతోందని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకే ఈ దర్యాప్తుల ద్వారా అక్రమ వాణిజ్య విధానాలు బయటపడే అవకాశం ఉందని గ్రియర్ అన్నారు. ఇక సెక్షన్ 301 దర్యాప్తు అంటే ఏమిటంటే, అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974లోని ఒక కీలక నిబంధన. ఈ నిబంధన ద్వారా అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల వాణిజ్య విధానాలు అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నాయా లేదా అని పరిశీలించగలదు.
వివరాలు
అక్రమ వాణిజ్య పద్ధతులు ఉన్నట్లు తేలితే.. టారిఫ్‌లు లేదా ఇతర ఆంక్షలు విధించే అవకాశం
అలాగే అమెరికా ఎగుమతులకు ఆటంకాలు కలిగించే విధానాలు, మార్కెట్‌లో ప్రవేశానికి ఉన్న అడ్డంకులు వంటి అంశాలను కూడా పరిశీలించడానికి ఈ చట్టం అవకాశం ఇస్తుంది. ఈ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం వివిధ మార్గాల ద్వారా ఆధారాలు సేకరిస్తుంది. ప్రజల అభిప్రాయాలు, సంబంధిత దేశాల సమాచారం వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుంది. దర్యాప్తు అనంతరం అక్రమ వాణిజ్య పద్ధతులు ఉన్నట్లు తేలితే, అమెరికా అధ్యక్షుడు సంబంధిత దేశాలపై టారిఫ్‌లు లేదా ఇతర ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది.
వివరాలు
మూడు దశల్లో దర్యాప్తు
ఈ దర్యాప్తు మూడు దశల్లో సాగనుంది. ఏప్రిల్ 15 వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తారు. మే 5 ప్రాంతంలో పబ్లిక్ హియరింగ్ జరగనుంది. అనంతరం జూలైకి ముందుగా తుది నివేదిక, చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి అమెరికా దర్యాప్తు చేయనున్న దేశాల జాబితాలో చైనా, యూరోపియన్ యూనియన్, భారత్, దక్షిణ కొరియా, మెక్సికో ఉన్నాయి. అలాగే జపాన్, తైవాన్, వియత్నాం, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, మలేసియా, కంబోడియా, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే అమెరికాతో రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న కెనడా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
వివరాలు
ఇతర దేశాలపై ఒత్తిడి కొనసాగించడానికి సెక్షన్ 301 దర్యాప్తును ఒక ప్రత్యామ్నాయ మార్గం
ఈ దర్యాప్తు ఎందుకు ప్రారంభించారనే ప్రశ్న కూడా వస్తోంది. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ అమలు చేసిన 'రిసిప్రోకల్ టారిఫ్' విధానాన్ని రద్దు చేసింది. అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించి విస్తృతంగా టారిఫ్‌లు విధించడం తన అధికారాన్ని మించి చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలపై ఒత్తిడి కొనసాగించడానికి ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు సెక్షన్ 301 దర్యాప్తును ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకో కోణంలో చూస్తే చైనా అంశం కూడా ఇందులో ఉంది. త్వరలో ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను కలవనున్నారు. ఆ సమావేశానికి ముందు వాణిజ్య చర్చల్లో బలమైన స్థానం సంపాదించడానికి ఈ దర్యాప్తును అమెరికా ఉపయోగించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
వాణిజ్య సంబంధాల్లో కొంత అనిశ్చితి
భారత్ కూడా ఈ దర్యాప్తులో ఉండటానికి ప్రధాన కారణం అమెరికాకు గతంలో నుంచే ఉన్న కొన్ని అభ్యంతరాలు. భారత్‌లో ఉన్న కొంత ఎక్కువ టారిఫ్‌లు,లోకల్ సోర్సింగ్ నిబంధనలు,ఔషధ రంగంలో ధర నియంత్రణలు వంటి అంశాలపై అమెరికా గతంలో విమర్శలు చేసింది. అయితే ఇటీవలే భారత్,అమెరికా మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ఒక రూపురేఖలను ప్రకటించారు. ఆ ఒప్పందం ప్రకారం భారత్ కొన్ని అమెరికా పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు సిద్ధమైంది. ఈ దర్యాప్తు వల్ల భారత్‌పై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాల్లో కొంత అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా వ్యూహాత్మక చర్య
ఎందుకంటే అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్. దర్యాప్తులో ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే భారత ఔషధాలు, ఐటీ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆటో భాగాలు వంటి రంగాలపై అదనపు టారిఫ్‌లు పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పరిస్థితులను చూస్తే, సెక్షన్ 301 దర్యాప్తు ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా ఉపయోగిస్తున్న ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇది ఎంతవరకు చర్యలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. ఇక భారత్ మాత్రం తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు అమెరికాతో చర్చలు కొనసాగించనుంది.