
Stock Market: డొనాల్డ్ ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు.
భారత్‌పై 26 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి.
సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 23,200 దిగువన ట్రేడింగ్ ప్రారంభించింది.
ఉదయం 9:25 గంటల సమయంలో, సెన్సెక్స్ (Sensex) 378 పాయింట్ల నష్టంతో 76,248 వద్ద, నిఫ్టీ (Nifty) 85 పాయింట్ల నష్టంతో 23,246 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
ఆసియా మార్కెట్లపై టారిఫ్‌ల ప్రభావం
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్,ఎంఅండ్‌ఎం, జొమాటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అయితే, సన్‌ఫార్మా,ఎన్టీపీసీ,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావం ఆసియా మార్కెట్లపై తీవ్రమైంది.
గురువారం ఉదయం జపాన్ నిక్కీ సూచీ ఏకంగా 3.4 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 2.95శాతం నష్టంతో ట్రేడవుతోంది.
అమెరికా అధ్యక్షుడు ఈ దేశంపై 24 శాతం సుంకాలు విధించారు. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 1.03 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.62 శాతం, షాంఘై 0.34 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
స్వల్ప లాభాలను నమోదు చేసిన అమెరికా మార్కెట్లు
ట్రంప్ ప్రకటనకు ముందు అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలను నమోదు చేశాయి.
ఎస్ అండ్ పీ 500 సూచీ 0.7 శాతం, డోజోన్స్ 0.6 శాతం, నాస్‌డాక్ 0.9 శాతం లాభపడ్డాయి. అయితే, టారిఫ్‌ల ప్రకటన వెలువడిన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 73.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,172 డాలర్ల వద్ద ఉంది.
రూపాయి-డాలర్ మారకం విలువ స్థిరంగా కొనసాగుతోంది.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా ₹1,539 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) ₹2,809 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.