Page Loader
Tupperware: అమ్మకాలు క్షిణించి.. పెరుగుతున్న పోటీతో దివాలా తీసిన టప్పర్‌వేర్ 
అమ్మకాలు క్షిణించి.. పెరుగుతున్న పోటీతో దివాలా తీసిన టప్పర్‌వేర్

Tupperware: అమ్మకాలు క్షిణించి.. పెరుగుతున్న పోటీతో దివాలా తీసిన టప్పర్‌వేర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2024
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ కిచెన్‌వేర్ కంపెనీ టప్పర్‌వేర్ బ్రాండ్స్ కార్ప్, అమ్మకాలు తగ్గడం, పెరుగుతున్న పోటీ కారణంగా దివాలా పిటిషన్ దాఖలు చేసింది. కంపెనీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ, కొత్త ఆర్థిక వనరులు లేకపోతే వ్యాపారాన్ని కొనసాగించడం కష్టం అవుతుందని గతంలో తెలిపిన విషయం విదితమే. దివాలా ప్రక్రియలో కూడా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. తమ వ్యాపారాన్ని విక్రయించడానికి కోర్టు అనుమతి కోరతామని కూడా పేర్కొంది. ఈ కిచెన్‌వేర్ దిగ్గజం గత కొన్ని దశాబ్దాలుగా ఆహార నిల్వ ఉత్పత్తుల మార్కెట్‌లో ప్రధాన స్థానాన్ని పొందింది. కానీ 2020 నుంచి వ్యాపార సామర్థ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయని కంపెనీ హెచ్చరించింది.

ఫైలింగ్ 

150 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక

ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీ దాని యూఎస్ ఫ్యాక్టరీని మూసివేయాలని, 150 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక చేసిందని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, టప్పర్‌వేర్ ప్రస్తుతం భారీ అప్పుల్లో ఉంది. పబ్లిక్‌గా ట్రేడవుతున్న ఈ కంపెనీ, దివాలా పిటిషన్ ద్వారా న్యాయ పరిరక్షణ కోరింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం, దాని ఆస్తులు 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఉంటే, అప్పులు 1 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి. దివాలా పిటిషన్ వార్తల కారణంగా, కంపెనీ షేర్ల విలువ 50 శాతం పడిపోయింది.

చర్చలు 

ఎయిర్ టైట్ సీల్డ్ కంటైనర్లపై పేటెంట్

1946లో ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ సంస్థ, ఎయిర్ టైట్ సీల్డ్ కంటైనర్లపై పేటెంట్ పొందింది. 1950లలో మహిళలు ఇళ్లలో టప్పర్‌వేర్ పార్టీలను నిర్వహించి, ఆహార నిల్వ కంటైనర్లను విక్రయించడంతో ఈ బ్రాండ్ వేగంగా ప్రసిద్ధి పొందింది. కానీ ఇప్పుడు, మార్కెట్‌లో చౌక ఉత్పత్తులతో పోటీని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ముడిసరకుల ధరలు, వేతనాలు, రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.