Forbes 30 Under 30 Asia 2026: ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా-2026'లో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా-2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు స్ధానం దక్కింది. ఆర్థిక రంగంలో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్న జెని5 అంకుర సంస్థ వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం, సామాజిక సేవా రంగంలో ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎడోద్వజ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధులాష్ బాబు క్రొవ్విడి ఈ ఘనతను అందుకున్నారు.
వివరాలు
కామిక్స్‌తో ఆర్థిక అక్షరాస్యత
చిన్నారులు, యువతకు చిన్న వయసులోనే ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో శివ గణేష్ గడ్డం తన ప్రయాణాన్ని ప్రారంభించారు. పొదుపు,వ్యయ ప్రణాళిక,పెట్టుబడులు,బీమా,వ్యాపారవేత్తగా ఎదగడం వంటి అంశాలను కామిక్స్ రూపంలో సులభంగా అర్థమయ్యే విధంగా అందించేందుకు ఆయన జెని5సంస్థను స్థాపించారు. డిజిటల్ యుగంలో ధన నిర్వహణ ప్రాముఖ్యతను కొత్త తరానికి చేరవేయడంలో ఆయన చేపట్టిన వినూత్న ప్రయత్నాలు ఫోర్బ్స్ జాబితాలో 'ఆర్థిక వ్యవహారాలు మరియు మూలధన పెట్టుబడులు' విభాగంలో స్థానం దక్కేలా చేశాయి. ఎమర్జెంట్ వెంచర్స్ నుంచి మంజూరు పొందిన జెని5 సంస్థ ప్రస్తుతం తొలి దశ పెట్టుబడుల సమీకరణకు సిద్ధమవుతోంది. విద్యార్థులకు నేరుగా ఆర్థిక సేవలను అందించే లక్ష్యంతో భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతుల కోసం కూడా సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
వివరాలు
గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మధులాష్ బాబు క్రొవ్విడి,గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరవేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఎడోద్వజ ఫౌండేషన్‌ను స్థాపించారు. పాఠశాలల్లో ఖరీదైన ప్రయోగశాలలు, సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని విద్యార్థుల వద్దకే తీసుకెళ్లే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆయన రూపొందించిన 'ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్' పేరుతో ప్రసిద్ధి చెందిన ఫ్లో బస్ ద్వారా గ్రామీణ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా పరిచయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 60వేల మందికి పైగా విద్యార్థులు సాంకేతిక విద్యలో శిక్షణ పొందారు. గ్రామీణ యువతలో విజ్ఞాన సామర్థ్యాలను పెంపొందించడంలో మధులాష్ చేస్తున్న కృషికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.