'Bring Jensen back': ఎన్విడియా కార్యాలయం వద్ద నిరసనకు దిగుతా.. ఉబర్ సహ వ్యవస్థాపకుడు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్విడియా (Nvidia) సీఈఓగా జెన్సెన్ హువాంగ్ ను తిరిగి నియమించాలనే డిమాండ్ టెక్ ప్రపంచంలో రోజురోజుకూ పెరుగుతోంది. ఈ అంశంపై తాజాగా ఉబర్ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ స్పందించారు. జెన్సన్‌కు మద్దతుగా ఎన్విడియా ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు. ఈ ఆందోళనలో ఎన్విడియా ఉద్యోగులతో పాటు ఇతర వ్యాపారవేత్తలు, ప్రముఖ టెక్ సంస్థల అధినేతలు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో మన చేతుల్లో లేకపోయినా.. సాధ్యమైనంత వరకు పోరాటం కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
2017 ఘటనతో పోలిక
జెన్సన్ ఎదుర్కొంటున్న పరిస్థితిని ట్రావిస్ కలానిక్ 2017లో ఉబర్ నుంచి తాను వైదొలగాల్సి వచ్చిన ఘటనతో పోల్చారు.
అప్పట్లో ఓ మాజీ ఉద్యోగి సంస్థలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేయడంతో పాటు, పని వాతావరణంలో నెలకొన్న వివాదాలపై యాజమాన్యం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ట్రావిస్ సంస్థ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ సమయంలో తనను తిరిగి ఉబర్ సీఈఓగా నియమించాలని కోరుతూ ఓ పిటిషన్ కూడా దాఖలైంది.
దీనికి సంబంధించిన 2017 నాటి వార్తా కథనాల స్క్రీన్‌షాట్‌లను ఇటీవల జెన్సన్ హువాంగ్‌కు పంపినట్లు ట్రావిస్ వెల్లడించారు.
వివరాలు
జెన్సన్‌కు మద్దతుగా నిలిచిన సిలికాన్ వ్యాలీ ప్రముఖులు
జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ ఇప్పటికే సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్, షాపీఫై సీఈఓ తొబియాస్ లుట్కె,ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ,వై కాంబినేటర్ సీఈఓ గ్యారీ ట్యాన్,రెప్లిట్ సీఈఓ అంజద్ మసాద్,ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ చెన్ తదితరులు ఈ డిమాండ్‌కు మద్దతుగా నిలిచారు.
వీరితో పాటు ఎన్విడియాకు చెందిన 8,760మంది ఉద్యోగులు కూడా ఈ ప్రయత్నంలో భాగమయ్యారు.
మొత్తం 1.75లక్షల మందికి పైగా ప్రజలు ఎన్విడియా బోర్డుకు బహిరంగలేఖ రాశారు.
జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించాలని అందులో కోరారు.దీంతో ఆయన పునర్నియామకం అంశం టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.