ఉబర్ రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాల కోతలు; 200 మందిపై వేటు
ప్రముఖ రైడ్-షేర్ కంపెనీ ఉబర్ త్వరలో కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంవుతోంది. తన రిక్రూటింగ్ టీమ్ నుంచి దాదాపు 200మందికి ఉద్వాసన పకలబోతోంది. ఈ మేరకు నిర్ణయాన్ని బుధవారం తమ ఉద్యోగులకు మెమో ద్వారా యాజమాన్యం తెలియజేసింది. అర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ఉబర్ చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో సరుకు రవాణా సేవల విభాగంలో 150 మంది ఉద్యోగులను తొలగించింది. 2020 మధ్యలో మహమ్మారి ప్రారంభంలో ఉబర్ తన సిబ్బంది సంఖ్యను 17శాతం సిబ్బందిని తగ్గించింది.
రిక్రూటింగ్ టీమ్‌లో 35శాతం ఉద్యోగుల తొలగింపు
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఉబర్‌లోని మొత్తం రిక్రూటింగ్ టీమ్‌లో 35శాతం మంది సభ్యులు ఈ తొలగింపుల వల్ల ప్రభావితమవుతారు. అయితే, ఈ కోతలు మొత్తం ఉబర్ సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువ అని కంపెనీ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. గతంలో కంపెనీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు తర్వాత, తాజాగా రిక్రూటింగ్ టీమ్‌లో లే ఆఫ్స్‌ను యాజమాన్యం ప్రకటించింది. తాజాగా తొలగింపులతో కలిపి కంపెనీలో ఇప్పటి వరకు మొత్తం 3శాతం కంటే తక్కువ మంది లేఆఫ్స్ బారిన పడ్డారు.