LOADING...
union budget 2026: తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రసంగం.. కొత్త రికార్డుల దిశగా నిర్మలా
budget 2026: తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రసంగం.. కొత్త రికార్డుల దిశగా నిర్మలా

union budget 2026: తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రసంగం.. కొత్త రికార్డుల దిశగా నిర్మలా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ 2026ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించబోతుండటంతో ఈసారి బడ్జెట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. 2019లో ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె మొత్తం ఎనిమిది బడ్జెట్లు (మధ్యంతర బడ్జెట్‌తో సహా) సమర్పించారు. ఇప్పుడు తొమ్మిదోసారి ఆమె బడ్జెట్ ప్రసంగం చేయనుండటం మరో రికార్డుగా మారనుంది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేరు మీద కొత్త రికార్డులు నమోదు కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

నిర్మలా సీతారామన్‌ ఒక అరుదైన రికార్డు

బడ్జెట్ ప్రసంగం వ్యవధి విషయానికి వస్తే... ఇప్పటికే నిర్మలా సీతారామన్‌ ఒక అరుదైన రికార్డును కలిగి ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. ఇప్పటివరకు ఇదే అత్యంత దీర్ఘకాలం కొనసాగిన బడ్జెట్ ప్రసంగంగా రికార్డుల్లో ఉంది. ఆసక్తికరంగా, ప్రసంగంలో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె ముగించారు. ఈసారి ఆ రికార్డును ఆమె తానే అధిగమించే అవకాశముందని రాజకీయ, ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే.. అత్యధిక బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తానే తిరగరాసుకోనున్నారు సీతారామన్. అలాగే బడ్జెట్ ప్రసంగంలో ఉపయోగించే పదాల సంఖ్య పరంగానూ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

బడ్జెట్‌లో మొత్తం 18,604 పదాలు

ఇప్పటివరకు అత్యధిక పదాలతో బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దక్కింది. 1991లో ఆయన ప్రవేశపెట్టిన చారిత్రక బడ్జెట్‌లో మొత్తం 18,604 పదాలు ఉపయోగించారు. ఈ రికార్డుకు దగ్గరగా 2018లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం నిలిచింది. మరోవైపు, 1977లో హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో బడ్జెట్ ప్రసంగం చేసి అతి తక్కువ పదాలతో బడ్జెట్ మాట్లాడిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అయితే ఈ రికార్డు ఇప్పటికీ చెరగకుండా కొనసాగుతోంది. ప్రస్తుతం రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్‌లో కలిసిపోవడంతో,అంత తక్కువ పదాలతో బడ్జెట్ ప్రసంగం జరగడం సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement