Goldman Sachs : 1,800 మంది ఉద్యోగులను తొలగించిన గోల్డ్‌మన్ సాక్స్
ప్రతిష్టాత్మక గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంక్ తన వార్షిక సమీక్షలో భాగంగా దాదాపు 1,300 నుంచి 1,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. మొత్తం ఉద్యోగుల్లో 3% నుంచి 4% మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తొలగింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉద్యోగుల తొలగింపులపై గోల్డ్‌మన్ సాక్స్ ప్రతినిధి టోనీ ఫ్రాట్టో స్పందించారు. ఈ సమీక్షలు సాధారణమైనవని, 2023తో పోల్చితే 2024లో ఉద్యోగుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల కోతలున్నప్పటికీ, సంస్థలో కొన్ని కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించవచ్చని ఆయన వివరించారు.
గతంలో కూడా ఉద్యోగుల తొలగింపు
గోల్డ్‌మన్ సాక్స్ మాత్రమే కాకుండా, ఇతర ప్రధాన బ్యాంకులు కూడా ఉద్యోగుల పనితీరును సమీక్షించి, పనితీరు తక్కువగా ఉన్న వారికి తొలగింపు చర్యలు తీసుకుంటున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 2023 మొదటి త్రైమాసికంలో ఇతర ప్రముఖ US బ్యాంకులు కలిసి సుమారు 5,000 మంది ఉద్యోగులను తొలగించాయి. సిటీ గ్రూప్ మాత్రమే 2,000 మందిని తొలగించింది. గతంలో కూడా గోల్డ్‌మన్ సాక్స్ సుదీర్ఘ కాలంగా వార్షిక సమీక్షల ప్రక్రియలో భాగంగా 2% నుండి 7% వరకు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.