LOADING...
UPI: యూపీఐకి పదేళ్లు పూర్తి.. లావాదేవీల్లో 12,000 రెట్ల అద్భుత వృద్ధి
యూపీఐకి పదేళ్లు పూర్తి.. లావాదేవీల్లో 12,000 రెట్ల అద్భుత వృద్ధి

UPI: యూపీఐకి పదేళ్లు పూర్తి.. లావాదేవీల్లో 12,000 రెట్ల అద్భుత వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఏప్రిల్ 11తో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ పదేళ్లలో లావాదేవీల సంఖ్యలో 12,000 రెట్లు, విలువలో 4,000 రెట్లకు పైగా పెరుగుదల సాధించి కొత్త రికార్డులు నెలకొల్పింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్ల లావాదేవీలు(రూ. 6,952 కోట్ల విలువ)తో ప్రారంభమైన యూపీఐ ప్రయాణం.. 2025-26 నాటికి 21,898 కోట్ల లావాదేవీలు (దాదాపు రూ. 285 లక్షల కోట్ల విలువ)కు చేరింది. కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. వ్యాపారుల క్యూఆర్ కోడ్‌లు, విక్రయ కేంద్రాల్లో చెల్లింపు యంత్రాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

వివరాలు 

నగదు వినియోగానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ చెల్లింపులు

ఇటీవల మార్చి 2026లో యూపీఐ కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆ నెలలో 22.64 బిలియన్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. గత ఏడాది మార్చితో పోలిస్తే ఇది 24 శాతం ఎక్కువగా నమోదైంది. ప్రస్తుతం ప్రతి నెల జరుగుతున్న యూపీఐ లావాదేవీల మొత్తం విలువ సుమారు రూ. 28 లక్షల కోట్లు ఉండగా, ఇది దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నగదులో దాదాపు 70 శాతానికి సమానంగా ఉంది. దీంతో నగదు వినియోగానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ చెల్లింపులు ఎంత బలంగా ఎదిగాయో స్పష్టమవుతోంది.

Advertisement