Loading...
UPI: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. అక్టోబరు 15 నుంచి అమలు
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. అక్టోబరు 15 నుంచి అమలు

UPI: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. అక్టోబరు 15 నుంచి అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
08:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో నగదు రహిత చెల్లింపులకు ప్రధాన ఆధారంగా మారిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై కొత్త రుసుముల నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే వ్యక్తిగత బదిలీలకు (పీ2పీ)ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఒక వ్యక్తి నుంచి మరొకరికి ఎంత మొత్తమైనా బదిలీ చేసుకోవచ్చు. నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు చేసినా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిమితి కూడా ఉండదు. అయితే పెద్ద వ్యాపార సంస్థలకు రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేస్తే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌)వర్తించనుంది. ఈ రుసుములు వ్యాపార సంస్థలకే వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 'చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్టం-2007'లోని సెక్షన్‌ 10ఏ కింద కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు 

రూ.2,000 దాటితే ఎండీఆర్‌ వర్తింపు

రూపే డెబిట్‌ కార్డులతో చేసే చెల్లింపులతో పాటు, రూ.2,000 లోపు వ్యాపార లావాదేవీలను (పీ2ఎం) ఉచిత ఎలక్ట్రానిక్‌ చెల్లింపు సాధనాలుగా ప్రభుత్వం వర్గీకరించింది.

వినియోగదారులు, వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించింది.

పెద్ద వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్‌ సంస్థలకు (పీ2ఎం) రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేస్తే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) వర్తిస్తుంది.

ఈ రుసుములు సాధారణ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డెబిట్‌ కావు. అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాల ప్రకారం ఈ ఛార్జీలు వర్తించనున్నాయి.

వివరాలు 

చిరు వ్యాపారులకు మినహాయింపులు

చిన్న వ్యాపారులకు కొత్త నిబంధనల్లో పలు మినహాయింపులు కల్పించారు.

నెలకు రూ.1 లక్ష వరకు: యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నెలకు రూ.1 లక్ష లోపు చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు (పర్సన్‌ టు పర్సన్‌ మర్చంట్‌-పీ2పీఎం) ఎలాంటి ఎండీఆర్‌ వర్తించదు. ఈ లావాదేవీలు పూర్తిగా ఉచితం.

రూ.2,000 దాటినా ఛార్జీ లేదు: చిరు వ్యాపారులకు రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీ వచ్చినా, వారి ఖాతా పీ2పీఎం పరిధిలో ఉంటే ఎలాంటి రుసుము ఉండదు.

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు: ఎండీఆర్‌ మినహాయింపు పొందేందుకు చిన్న వర్తకులకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కాదు. వారు తమ క్యూఆర్‌ కోడ్‌లు లేదా సౌండ్‌బాక్స్‌లను మార్చాల్సిన అవసరం లేదు.

ADVERTISEMENT

వివరాలు 

కొన్ని రంగాల్లో రూ.5 స్థిర రుసుము

మూడు నెలల నిబంధన: వరుసగా మూడు నెలలపాటు నెలకు రూ.1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో జమైతేనే ఆ ఖాతాను పీ2ఎం (పర్సన్‌ టు మర్చంట్‌)పరిధిలోకి మారుస్తారు.

కొన్ని నిర్దిష్ట రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై శాతంతో సంబంధం లేకుండా కేవలం రూ.5 స్థిర ఎండీఆర్‌ మాత్రమే వర్తిస్తుంది. ఆ రంగాలు ఇవి:

బీమా ప్రీమియం చెల్లింపులు

పెట్రోలు, డీజిల్‌ కొనుగోళ్లు

ప్రభుత్వ విద్యుత్‌, నీరు, పైప్‌డ్‌ గ్యాస్‌ బిల్లులు

పాఠశాల, కళాశాల ట్యూషన్‌ ఫీజులు,ప్రవేశ పరీక్షల ఫీజులు

టెలికాం బిల్లులు

రైలు టిక్కెట్ల చెల్లింపులు

వినియోగ బిల్లులకు 'ఆటోపే'సదుపాయాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేక ఎండీఆర్‌ లావాదేవీ ఛార్జీ ఉండదు. రికరింగ్‌ డిపాజిట్లు, ఓటీటీ చెల్లింపులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలకు 0.02% రుసుము

క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలకు సంబంధించి ఎన్‌పీసీఐ ప్రత్యేక రాయితీ రేటును నిర్ణయించింది.

మ్యూచువల్‌ ఫండ్లు, సెబీ నమోదిత స్టాక్‌ బ్రోకర్లు, షేర్ల కొనుగోళ్లు, బ్రోకర్‌ వాలెట్‌ టాప్‌-అప్‌లకు చేసే యూపీఐ బదిలీలపై 0.02% (2 బేసిస్‌ పాయింట్లు) మాత్రమే ఎండీఆర్‌ వర్తిస్తుంది.

లావాదేవీ విలువ ఎంత పెద్దదైనా, ఒక్కో చెల్లింపుపై గరిష్ఠ ఎండీఆర్‌ను రూ.300కు పరిమితం చేశారు.

వివరాలు 

రూ.2,000 మించినవి 4% మాత్రమే

రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపైనే రుసుము విధించడానికి ప్రధాన కారణం వాటి సంఖ్య తక్కువగా ఉండటమే.

2025-26లో వ్యాపారులకు యూపీఐ ద్వారా దాదాపు రూ.198 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి.

ఇందులో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు కేవలం 4 శాతమే. అంటే, 96 శాతం లావాదేవీలు రూ.2,000 లోపు విలువతోనే జరుగుతున్నాయి.

అయితే వ్యాపారులకు వెళ్లిన మొత్తం సొమ్ములో రూ.2,000 మించిన లావాదేవీల వాటా 66 శాతంగా ఉంది.

అంటే దాదాపు రూ.131 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు ఈ విభాగంలోనే జరిగాయి.

వివరాలు 

రూ.2,000 మించినవి 4% మాత్రమే

యూపీఐ వ్యవస్థను సురక్షితంగా నిర్వహించడం, సర్వర్ల రక్షణ, మోసాల నివారణ వంటి అంశాల కోసం ఏటా రూ.20,700 కోట్లు ఖర్చవుతున్నట్లు పార్లమెంటరీ కమిటీ అంచనా వేసింది.

మరోవైపు, ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద 2021-22 నుంచి 2024-25 వరకు రూ.8,276 కోట్లు వెచ్చించింది.

ఈ నేపథ్యంలో యూపీఐ వ్యవస్థ నిర్వహణకు పెద్ద వర్తకులపై రుసుము విధింపు అవసరమైందని కేంద్రం పేర్కొంది.

వివరాలు 

పదేళ్లలో భారీగా విస్తరించిన యూపీఐ

2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ వ్యవస్థ విజయవంతంగా పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం 741 బ్యాంకులు ఈ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి. దేశీయ డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ 84 శాతం వాటాను సాధించింది.

జులైలో రూ.29.88 లక్షల కోట్ల విలువైన 2,366 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఆగస్టులో లావాదేవీల సంఖ్య 2,451 కోట్లకు పెరిగింది.

ఆ నెలలో లావాదేవీల విలువ రూ.29.82 లక్షల కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగానూ యూపీఐ విస్తరిస్తోంది.

సింగపూర్‌, మలేషియా, యూఏఈ సహా 11 దేశాలకు ఈ చెల్లింపు వ్యవస్థ విస్తరించింది.

అంతర్జాతీయంగా బ్రెజిల్‌ (0.33%), చైనా (0.40%) డిజిటల్‌ నెట్‌వర్క్‌లలోనూ ఎండీఆర్‌ అమల్లో ఉంది.

వివరాలు 

ఎండీఆర్‌ ఆదాయం ఎలా పంచుతారు?

ఎండీఆర్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపిణీ చేసేందుకు ఎన్‌పీసీఐ పరిధిలోని 22 మంది సభ్యుల యూపీఐ అండ్‌ సర్వీసెస్‌ కమిటీ నిబంధనలు ఖరారు చేసింది. వసూలయ్యే ఎండీఆర్‌ మొత్తంలో:

ఖాతా ఉన్న బ్యాంకులకు - 40%

యూపీఐ యాప్‌లను నిర్వహించే సంస్థలకు - 30%

వ్యాపారులను అనుసంధానించిన బ్యాంకులకు - 30% చొప్పున ఆదాయం దక్కుతుంది.

ఈ ఆదాయంలో కొంత భాగాన్ని గ్రామీణ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పీఎం స్వనిధి లబ్ధిదారులకు డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధిగా కేటాయించనున్నారు.

ప్రస్తుతం డెబిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఎండీఆర్‌ గరిష్ఠంగా 0.90% వరకు ఉంది. క్రెడిట్‌ కార్డులపై ఈ రుసుము 1.5% నుంచి 2.5% వరకు ఉంటోంది.

ADVERTISEMENT