MDR on UPI: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. రూ.2,000 తర్వాత ఛార్జీలు ఎలా ఉంటాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
₹2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై త్వరలో స్పష్టత రానుంది. బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లతో కూడిన ప్రత్యేక కమిటీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, రూ.2,000 లోపు యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలూ ఉండబోవని కేంద్రం స్పష్టంచేసింది. మర్చంట్ డిస్కౌంట్ రేటుపై త్వరలో నిర్ణయం 22 మంది సభ్యులతో ఏర్పాటైన 'ది యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ' రూ.2,000 దాటిన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను త్వరలో ఖరారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూపీఐ వ్యవస్థ స్వయం సుస్థిరత సాధించడం, మార్కెట్ విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఛార్జీలను నిర్ణయించనున్నారు.
వివరాలు
ఇతర దేశాల్లో ఎండీఆర్ ఇలా..
ప్రస్తుతం బ్రెజిల్‌లోని పీఐఎక్స్ (Pix) చెల్లింపుల వ్యవస్థలో 0.33 శాతం మర్చంట్ రేటు వసూలు చేస్తున్నారు.
చైనాలోని చెల్లింపుల వ్యవస్థలో ఈ రేటు 0.40 శాతంగా ఉంది. భారత్‌లో యూపీఐ లావాదేవీలకు ఎంత ఎండీఆర్ విధించాలనే దానిపై త్వరలో స్పష్టత రానుంది.
పెద్ద వ్యాపార చెల్లింపులపై 0.3-0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదు.
వ్యక్తిగత నగదు బదిలీలపై ఛార్జీలు ఉండవు
రూ.2,000 లోపు యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం తాజాగా స్పష్టంచేసింది.
అంతేకాదు.. రూ.2,000 దాటినా వ్యక్తులు ఒకరికొకరు పంపుకొనే నగదు బదిలీలపై ఎలాంటి ఛార్జీలూ ఉండవు.
వివరాలు
కస్టమర్లపై భారం పడుతుందా?
ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేటు కేవలం వ్యాపారులకు చేసే చెల్లింపులపైనే వర్తించనుంది.
యూపీఐ ఛార్జీల వల్ల సామాన్యులపై ఎలాంటి అదనపు భారం పడబోదని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, వ్యాపారులపై పడే ఈ వ్యయాన్ని వారు వినియోగదారులపైకి బదిలీ చేస్తారేమోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎండీఆర్ అమలు విధానం, దాని ప్రభావం వంటి అంశాలపై తుది నిర్ణయం వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.