UPI Payments: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక ప్రకటన.. రూ.2000 వరకు లావాదేవీలు ఉచితం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా యూపీఐ (Unified Payments Interface) వినియోగించే కోట్లాది మందికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. రూపే ఆధారిత డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకూ ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
వివరాలు
బ్యాంకులు, పేమెంట్ సంస్థలు ఛార్జీలు వసూలు చేయకూడదు
పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏ కింద ఈ మార్పులను నోటిఫై చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నోటిఫికేషన్ ప్రకారం.. రూ.2,000 వరకు చేసే యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు లేదా ఇతర పేమెంట్ సంస్థలు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు.
ఈ నిబంధన డబ్బులు పంపే వ్యక్తులతో పాటు, చెల్లింపులు స్వీకరించే వారికీ వర్తిస్తుంది.
ఛార్జీల ప్రచారంపై కేంద్రం స్పష్టత
ఇటీవల యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది.
వివరాలు
వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ ఉంటే..
వ్యక్తిగతంగా చేసే పీ2పీ (Person-to-Person) యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం గత నెలలోనే హామీ ఇచ్చింది.
భవిష్యత్తులో వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించినా.. నిర్ణీత పరిమితిని మించిన లావాదేవీలకు మాత్రమే, అదీ నామమాత్రంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఛార్జీలు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై విధించే రుసుములతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది.